ORR Lease : టార్గెట్ కేటీఆర్.. ORR టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..

హరీశ్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నా..

ORR Lease : టార్గెట్ కేటీఆర్.. ORR టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..

KTR

Updated On : December 20, 2024 / 2:07 PM IST

ORR Lease : కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ-1గా కేటీఆర్ ఉన్నారు. ఓఆర్ఆర్ అంశంలోనూ కేటీఆర్ టార్గెట్ గా సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ లీజుపై సిట్ కొరడా ఝళిపించింది. సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ, సిట్ స్పీడ్ తో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

”ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రే డిమాండ్ చేశారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ వేయండని డిమాండ్ చేశారు. వారు మనస్ఫూర్తిగా విచారణకు అడిగారో.. వారి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నా. హరీశ్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నా” అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అటు.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏ-1 గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ-3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. 13 1 ఏ, 13 2, పీసీ యాక్ట్ 409, 120 బీ ఐపీసీ సెక్షన్లు నమోదు చేసింది ఏసీబీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ పీఈవో కంపెనీకి హెచ్ఎండీఏ 45 కోట్ల రూపాయలు చెల్లించిందని ఏసీబీ తెలిపింది. క్యాబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించారని కేటీఆర్ పై అభియోగాలు మోపింది.

ఐఏఎస్ అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతులు లేకుండానే చెల్లింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్ వేసింది. అధికారంలోకి వచ్చాక రేవంత్ సర్కార్ ఆ 8 కోట్లు ఆర్బీఐకి చెల్లించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకుంది ప్రభుత్వం. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు ఉపక్రమించింది. సోమవారం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్ పై విచారణ చేపట్టాలని ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు.

Also Read : టాలీవుడ్‌‌ని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందా? కారణం అదేనా?