Cm Revanth: పాలమూరు వెనుకబాటుకు కారణమిదే.. బీఆర్ఎస్ కడుపు మంట అదే- సీఎం రేవంత్ రెడ్డి
కాంట్రాక్టర్లకు 25వేల కోట్ల రూపాయలు ఇచ్చారు, రైతులకు మాత్రం భూ పరిహారం ఎందుకివ్వలేదు అని నిలదీశారు.
- పాలమూరుకు ఎందుకు అన్యాయం చేశారు
- పదేళ్లు పాలించినా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు
- అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారు
Cm Revanth: మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. 12వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు వెనుకబాటుకు కారణం ఏంటో చెప్పారు. గత ప్రభుత్వాలు పాలమూరును పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు పాలించినా పాలమూరులో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదన్నారు. పాలమూరు జిల్లాకు చెందని ఏ ప్రాజెక్ట్ ను కూడా కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లకు 25వేల కోట్ల రూపాయలు ఇచ్చారు, రైతులకు మాత్రం భూ పరిహారం ఎందుకివ్వలేదు అని నిలదీశారు. సంగంబండలో ఒక చిన్న బండ కూడా పగలగొట్టలేదన్నారు. గత ప్రభుత్వంలో భూసేకరణకు నిధులు మంజూరు చేయలేదని రేవంత్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు జిల్లాకు ఎందుకు అన్యాయం చేశారు అని మాజీ సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు.
పాలమూరుపై ఎందుకు వివక్ష చూపించారు..
పాలమూరుపై ఎందుకు వివక్ష చూపించారు అని ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డను అయిన నేను సీఎం కావడంతో వాళ్లకు కడుపు మంట అని విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల మీద చర్చించకుండా అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని నిలదీశారు. తెలంగాణ ప్రజల మీద బీఆర్ఎస్ నాయకులకు ప్రేమ లేదన్నారు.
Also Read: విద్య మీ జీవితాలను మారుస్తుంది.. 25ఏళ్లు కష్టపడితే 75ఏళ్ల వరకు గౌరవంగా జీవించొచ్చు- సీఎం రేవంత్
ఇదే వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు జిల్లాలో ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు కాదు కదా.. పదేళ్లు పాలమూరుపై వివక్ష చూపారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకునే రాక్షసులను ఎలా అడ్డుకోవాలో పాలమూరు బిడ్డగా తనకు బాగా తెలుసున్నారు. తనకు అన్ని వ్యూహాలు తెలుసని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంట్రాక్టర్లకు 25వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చారు తప్ప.. ఉద్దండాపూర్ భూసేకరణకు రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇవ్వలేదని రేవంత్ అడిగారు.
”మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణా రావు హైదరాబాద్ రాష్ట్రానికి బాధ్యత వహించారు. 75 ఏళ్ల తర్వాత అదే పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రై ఈ జిల్లా సమస్యలను తీర్చే అవకాశం వచ్చింది. వాళ్ల కడుపు మంట అంతా అదే. మా చేతి కింద, చెప్పు కింద ఉండాల్సిన వాళ్లు, మా మోచేతి నీళ్లు బతకాల్సిన వాళ్లు.. ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా? పాలమూరుకు నిధులు మంజూరు చేస్తారా? అని ఇవాళ కుట్రలతో మళ్లీ మీ దగ్గరికి వచ్చి నాటకాలు మొదలు పెట్టారు” అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
