MLA Jagga Reddy : జగ్గారెడ్డికి హైకమాండ్ షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు

సంగారెడ్డి MLA Jagga Reddy కి కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాకిచ్చింది. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి..

MLA Jagga Reddy : జగ్గారెడ్డికి హైకమాండ్ షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు

Jagga Reddy

Updated On : March 21, 2022 / 7:25 PM IST

MLA Jagga Reddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాకిచ్చింది. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ఈ మేరకు టీపీసీసీ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ వెల్లడించింది. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. పార్టీకి సంబంధించి జగ్గారెడ్డి నిర్వర్తించే బాధ్యతలను మిగిలిన ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తున్నట్లు టీపీసీసీ తెలిపింది.

తాను స్వతంత్రంగా ఉంటానని చెబుతూ జగ్గారెడ్డి గతంలో అధిష్టానానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, అసలు కారణం అది కాదని, జగ్గారెడ్డి ఈ మధ్య చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని తెలుస్తోంది. జగ్గారెడ్డి నుంచి తొలగించిన బాధ్యతల్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌, మహేష్‌గౌడ్‌లకు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.(MLA Jagga Reddy)

Revanth Reddy: “రేవంత్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు.. సస్పెండ్ చేస్తే సత్తా చూపిస్తా”

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటి నుంచి జగ్గారెడ్డి ఆయనపై గుర్రుగా ఉన్నారు. రేవంత్ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌కి పీసీసీ చీఫ్ పదవి ఎలా కట్టబెట్టతారని బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. అంతేకాదు కొంత కాలంగా పార్టీ నిర్ణయాలపైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. అయితే సోనియా, రాహుల్‌ గాంధీతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని యూటర్న్ తీసుకున్నారు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌.. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్‌పైనా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. తనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్దిని నిలబెట్టి గెలిపించగలరా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. ఆయనను పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తప్పించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Jagga Reddy : రాజీనామా చేస్తా, నో డౌట్.. టీఆర్ఎస్‌లోకి వెళ్లను- ఎమ్మెల్యే జగ్గారెడ్డి

 

పార్టీ బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పందించారు. క్రమశిక్షణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. పార్టీకి నష్టం జరిగేలా ఎవరు వ్యవహరించినా, కార్యక్రమాలు చేసినా, ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు. నిన్న జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా పార్టీ లైన్ దాటినట్లు భావిస్తున్నామన్నారు.