మీ వాళ్లు చనిపోయారు.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటున్నారు

కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వారే కాదు, వివిధ జిల్లాలకు సంబంధించిన వారు కూడా మృతదేహాలను చూసేందుకు కూడా రావడం లేదు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. అయితే డెడ్ బాడీలను దహనం చేసేందుకు దహన వాటికల చుట్టు పక్కల ప్రాంతాల వారు ఒప్పుకోవడం లేదు. దీంతో జీహెచ్ ఎంసీ సిబ్బందికి దహన సంస్కారాల నిర్వహించడం సమస్యగా మారింది. ఎవరూ వ్యతిరేకించకుండా ఉండే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉంటే చూపాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.
సమస్యగా మారిన హిందువుల దహన సంస్కారాలు
కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాల నిర్వహణకు ఇదివరకే ప్రభుత్వం ఆయా మతాలవారీగా మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం దహన సంస్కారాలకు కుటుంబంలోని ఐదుగురు సభ్యులను అనుమతిస్తారు. అయితే వారు పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ దూరంగా ఉండి మాత్రమే శవాన్ని చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులే చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 22 మంది కరోనాతో మృతి చెందగా, వీరిలో ఆరుగురు హిందువులు, మిగిలినవారు ముస్లిం మతానికి చెందినవారు ఉన్నారు. ముస్లిం మతస్తులను ఎర్రగడ్డ, ఆసిఫ్ నగర్ లతో పాటు పాతబస్తీలోని వివిధ శ్మశానా వాటికల్లో ఖననం చేస్తున్నారు. అయితే హిందువుల దహన సంస్కారాలే సమస్యగా మారింది. బంజారాహిల్ల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఒకరికి, ఎర్రగడ్డలో ఇద్దరికి, లాలాపేట్ లో ఒకరికి, అబ్దుల్లాపూర్ మెట్ లో ఇద్దరికి దహన సంస్కారాలు నిర్వహించారు. అల్వాల్, అంబర్ పేట్, బన్సీలాల్ పేట్ తదితర శ్మశానవాటికలకు తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు ఆయా శ్మశానవాటికల నిర్వాహకులు వ్యతిరేకించారు.
కరోనా మృతదేహాలను దహనానికి తిరస్కరణ
ఇప్పటివరకు నిర్వహించిన దహన సంస్కారాలు కూడా అతి కష్టం మీద నిర్వహించినట్లు అధికారి తెలిపారు. కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు ఎవరూ ఒప్పుకోవడం లేదన్నారు. పోలీసుల సాయంతో అబ్ధుల్లాపూర్ మెట్ లోని గుట్టల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో దహనం చేస్తున్నా… స్థానికులు వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. బుధవారం రెండు మృతదేహాలను అంబులెన్స్ లలో అబ్ధుల్లాపూర్ మెట్ కు తరలించగా అక్కడి స్థానిక నాయకులతో పాటు కొందరు గ్రామస్థులు వ్యతిరేకించారని, అయితే అప్పటికే దహన సంస్కారాలు పూర్తికావడంతో మరోసారి ఇక్కడికి శవాలను తేవద్దంటూ హెచ్చరించారన్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు ఎవ్వరూ వ్యతిరేకించని ప్రభుత్వ స్థలం ఎక్కడుందో చూపాలంటూ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.
చనిపోయిన వార్త తెలియగానే ఫోన్లు స్విచ్ ఆఫ్
కరోనా మృతుల్లో నగరంతోపాటు నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్, రంగారెడ్డి తదితర జిల్లాలకు చెందినవారు ఉన్నారు. అయితే ఇందులో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఎవరూ కనీసం దహన సంస్కారాలకు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. చనిపోయిన వార్త తెలుసుకున్న వెంటనే కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారని, తాము కోరినా వారు రావడం లేదన్నారు. మృత దేహాల వద్దకు వచ్చేముందు బంధువులకు అవసరమైన రక్షణ చర్యలు పాటిస్తామని చెబుతున్నా ఎవరూ వినడం లేదని పేర్కొన్నారు. కనీసం చివరి చూపు కోసం కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ముస్లింలను పూడ్చేందుకు కూడా మొదటగా ఆయా శ్మశానవాటికల నిర్వాహకులు, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పాతబస్తీలోని ఎమ్మెల్యేల జోక్యంతో ఇప్పుడు సమస్య తీరిపోయిందని అధికారులు తెలిపారు.
పని చేయని విద్యుత్ దహన వాటికలు
వాస్తవానికి జీహెచ్ఎంసీలో అంబర్ పేట్, ఎర్రగడ్డ, బన్సీలాల్ పేట్, పంజాగుట్ట తదితర చోట్ల నాలుగు విద్యుత్ దహనవాటికలు ఉన్నాయి. అయితే నిర్వహణలోపం కారణంగా చాలా కాలంగా అవి పనిచేయడం లేదు. దీంతో జనం సంప్రదాయ పద్ధతుల్లోనే కట్టెలతో దహన సంస్కారాలు నిర్వహస్తున్నారు. కనీసం వీటిని మరమ్మతు చేయించి ఉపయోగంలోనికి తెద్దామంటే సంబంధిత ఇంజనీర్లు ఇప్పుడు అందుబాటులో లేరని, అది ఇప్పట్లో అయ్యేపనికాదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇవి పనిచేస్తే పది నిమిషాలకు ఒకటి చొప్పున శవాలను దహనం చేసే వీలు కలుగుతుందని, కరోనా మృతుల దహనానికి ఇబ్బంది ఉండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా మానవ సంబంధాలకు కూడా పరీక్ష పెడుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
దహన సంస్కారాల్లో కలకలం
కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు అధికారులు గుట్టుగా జరపడం కవాడిగూడలో కలకలం రేపింది. సికింద్రాబాద్ సింధికాలనీలో నివాసం ఉండే వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు రాజస్థన్ చెందిన వాడు కావడంతో రాజస్థానీ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిపారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అంబులెన్స్ సిబ్బంది ధరించిన డ్రెస్ లు చూసి బస్తీల వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దహన సంస్కారాలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. శుక్రవారం (ఏప్రిల్ 24, 2020) ఉదయం బస్తీల వాసులకు శ్మశాన వాటిక బయట పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్ లు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్తీ వాసులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న గాంధీనగర్ ఎస్ ఐ రవీందర్ అతను కరోనాతో మరణించలేదని తెలిపారు. కానీ గురువారం రాత్రి కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలే జరిగినట్లు శ్మశాన వాటిక సిబ్బంది తమకు చెప్పారని బస్తీల ప్రజలు తెలిపారు. అంత్యక్రియల్లో సిబ్బంది ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు నిర్లక్ష్యంగా వదిలివెళ్లడంతో వైరస్ వ్యాపించదా అని స్థానికులు నిలదీశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చూడాలని పోలీసులకు తెలపారు. శ్మశాన వాటికతోపాటు చట్టుపక్కల బస్తీల్లో క్రిమి సంహారక మందులు చల్లించాలని కోరారు. వెంటనే ఎస్ఐ…జీహెచ్ ఎంసీ సిబ్బందిని రప్పించి పీపీఈ కిట్లు, గ్లౌజ్ లు, మాస్కులను తొలగించారు. అనంతరం ఆ ప్రాంతమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు.