Cockroach In Biryani : బాబోయ్.. బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్‌లోని హోటల్‌లో మరో దారుణం..

ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే హోటల్స్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు.

Cockroach In Biryani : బాబోయ్.. బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్‌లోని హోటల్‌లో మరో దారుణం..

Updated On : November 28, 2024 / 6:11 PM IST

Cockroach In Biryani : హైదరాబాద్ లో హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారడం లేదు. కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. హోటల్స్, రెస్టారెంట్లలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. కస్టమర్లకు తినేందుకు ఇచ్చే ఆహారంలో పురుగులు దర్శనమిస్తూనే ఉన్నాయి. బంజారాహిల్స్ లోని బిర్యానీ వాలా హోటల్ లో కస్టమర్ బిర్యానీ తింటుండగా అందులో ఓ చచ్చిన బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింకను చూసి కస్టమర్లు షాక్ కి గురయ్యారు. దీనిపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ ముందు ఆందోళనకు దిగారు. బిర్యానీ వాలా హోటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నగరంలోని హోటళ్ల నిర్లక్ష్య వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్ లో పరిశుభ్రత పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని పలు హోటల్స్ పై కేసులు కూడా పెట్టారు. అయినా హోటళ్ల నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల తర్వాత కూడా పలు హోటల్స్ లో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది.

తాజాగా బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 3లో ఉన్న బిర్యానీ వాలా హోటల్ లో బిర్యానీ తింటున్న కస్టమర్ కు షాక్ తగిలింది. బిర్యానీలో చచ్చిన బొద్దింక కనిపించడంతో కస్టమర్ కంగుతిన్నారు. వెంటనే దీనిపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా.. దానికి మేమేం చేస్తాం అంటూ వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్లంతా ఆందోళనకు దిగారు. అటు పోలీసులకు, ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే హోటల్స్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్స్, రెస్టారెంట్లపై ఇక నుంచైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలన్నారు.

 

Also Read : వసతి గృహాల్లో తరుచూ వివాదాస్పద ఘటనలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు