YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకంటే?
ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

popular YouTuber Anvesh
YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్ లో పలువురు ఉన్నతాధికారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుమతిలేని బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేస్తున్న వారిపై అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎందరో మన్ననలు పొందుతున్నాడు. అన్వేష్ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న వీడియోలను చూసిన ఐపీఎస్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఇటీవల అతన్ని మెచ్చుకున్నారు. కానీ, బెట్టింగ్ యాప్స్ పై పోరాటం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారులు దాన కిషోర్, వికాస్ రాజ్ తదితరులు మెట్రోలో బెట్టింగ్ యాప్ ల ప్రచారం ద్వారా రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఒక వీడియోలో అన్వేష్ అసత్యాలు ప్రచారం చేశాడని అతనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read: ఆ టాస్క్ విషయంలో మంత్రులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు?
ఫిర్యాదులో.. ‘‘రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రభుత్వ అధికారులతోపాటు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ట దెబ్బతీసేలా యూట్యూబర్ అన్వేష్ ఇటీవల ఓ వీడియో చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని పెంచేలా ఆ వీడియో కంటెంట్ ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా డీజీపీ సహా పలువురు ఐఏఎస్ అధికారులపై, మెట్రో ఎండీపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్ అన్వేష్ పై చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో కానిస్టేబుల్ పేర్కొన్నాడు. అన్వేష్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు త్వరలోనే అతడిపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది.