196 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి, వారి కోసం అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తాం- డిప్యూటీ సీఎం భట్టి

అన్ని పార్టీలు ముందుకొచ్చి సలహాలు ఇవ్వండి. సబర్మతి బాగు చేస్తే పొగుడుతారు. మూసీ బాగైతే నచ్చదా?

196 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి, వారి కోసం అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తాం- డిప్యూటీ సీఎం భట్టి

Updated On : October 7, 2024 / 5:47 PM IST

Mallu Bhatti Vikramarka : ORR చుట్టూ 2014 తర్వాత 196 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. చెరువులను పరిరక్షించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ లో చెరువులు కనిపించవని హెచ్చరించారు.

”మూసీలో ఉన్న పేదలకు నష్టం చేయం. వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వానిదే బాధ్యత. నిరాశ్రయులు అవుతున్న వారితో ప్రభుత్వం మాట్లాడుతుంది. పేదల కోసం చర్చించేందుకు.. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే మూసీ పేదలకు రూ.10 వేల కోట్లు ఖర్చుకు సర్కార్ రెడీగా ఉంది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం ఇష్టం లేదా? ప్రభుత్వాన్ని, సీఎంను అడ్డగోలుగా మాట్లాడొద్దు. అన్ని పార్టీలు ముందుకొచ్చి సలహాలు ఇవ్వండి. సబర్మతి బాగు చేస్తే పొగుడుతారు. మూసీ బాగైతే నచ్చదా? పేదోడు ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో మాకు తెలుసు. మరింత మెరుగైన నివాసాలు కల్పిస్తాం. మూసీ నిర్వాసితులకు మేలు జరిగేలా సలహాలు ఇవ్వండి.

చెరువులను ఎఫ్టీఎల్ వరకైనా కాపాడుకోవాలి. మన రాష్ట్రం, మన నగరం తెచ్చుకున్నాం. మన చెరువులు మనకు ఉండొద్దా? భవిష్యత్ కు ఈ చెరువులను అందించాలన్నదే ఆశ. హరీశ్ రావు, కేటీఆర్ సైతం గతంలో ఈ చెరువులను కాపాడాలని అనలేదా? ORR చుట్టూ 2014 తర్వాత 196 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

”హైదరాబాద్ లో 20 పార్క్ లు కబ్జాకు గురయ్యాయి. ఈ చెరువులన్నీ సీఎం రేవంత్ రెడ్డివో, మంత్రులవో కావు. సమాజానివి. హైదరాబాద్ అంటేనే.. రాక్స్, లేక్స్, పార్కులు. కబ్జాకు గురైన చెరువులన్నీ హైదరాబాద్ ప్రజల ఆస్తి. చాలా ప్రాంతాల్లో చెరువులు, పార్కులు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ లో చెరువులు కనిపించవు. ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.

నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. చెరువులను కాపాడటంతో పాటు మూసీని ప్రక్షాళన చేయాలి. హైడ్రాపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. సరైన విధానం లేక వనరులన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. చెరువులు కనుమరుగైతే నష్టం ఎవరికి? లండన్ నగరం మధ్యలో నుంచి థేమ్స్ నది పోతోంది. హైదరాబాద్ లో మూసీ నది కళ్ల ముందే మాయమవుతోంది. చెరువులను ఎఫ్ టీఎల్ వరకైనా కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు చెరువులను అందించాలన్నదే మా ఆశ. మూసీ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. వారికి ఎలా న్యాయం చేయాలి అనేదానిపై మీ సలహాలు ఇవ్వండి. మేము స్వీకరిస్తాం” అని భట్టి విక్రమార్క అన్నారు.

Also Read : తెలంగాణ ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం..! కారణం అదేనా?