తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్‌గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నారు.

Telangana Bjp President : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. దశలవారిగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రామచందర్ రావు, మనోహర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఉన్నారు.
ఈటలకే పగ్గాలు ఇవ్వాలని కొందరు నేతలు ప్రతిపాదించారు. అయితే, బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు చెబుతున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు అధిష్టానాన్ని కలిసి తమను ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రానికి, పార్టీకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే అంశాలను హైకమాండ్ కు వివరించారు. అయితే, ఏదైనా అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కోసం బీజేపీ హైకమాండ్ ప్రయత్నం చేయడం సర్వ సాధారణం. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికలో మాత్రం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క నేత పేరు చెప్పినా వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సస్పెన్స్ గా మారింది.
బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్ గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా మరికొందరు సైతం రాష్ట్ర అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూపిస్తామని జాతీయ నేతల వద్ద చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క నేత పేరుపైన కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఏకాభిప్రాయ సాధన కోసం జాతీయ నాయకత్వం కృషి చేస్తోంది. దశల వారిగా బీజేపీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది.
Also Read : విలీన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ నేతల తంటా