దుబ్బాక ఉప ఎన్నిక : ప్రజల తీర్పు ఎటువైపు, మళ్లీ టీఆర్ఎస్ ?

  • Published By: madhu ,Published On : October 9, 2020 / 07:51 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక : ప్రజల తీర్పు ఎటువైపు, మళ్లీ టీఆర్ఎస్ ?

Updated On : October 9, 2020 / 8:33 AM IST

dubaka by election : దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. దుబ్బాక త్రిముఖ పోరులో ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. నవంబర్‌ 3న ఉప ఎన్నిక జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌నే అందలం మెక్కిస్తారా..? కాంగ్రెస్‌, బీజేపీ ఒకదానికి అవకాశమిస్తారా..? అనేది వేచి చూడాల్సిందే.



విజయం ఎవరిదైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతోందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో.. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహ రచనల్లో మునిగిపోయాయి. నవంబర్‌ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఖాయంగా కనబడుతుండగా.. గెలుపుపై ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు.



దుబ్బాక బైపోల్‌ బరిలో అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. దీంతో ఆయా పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీల ముఖ్యనేతలకు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటిండంతో.. ఎన్నికల ప్రచారం జోరందుకుంది.



దుబ్బాకలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొందాలని టీఆర్‌ఎస్‌ పట్టుబడుతోంది. సెంటిమెంట్‌ను బేస్‌ చేస్తూ.. రామలింగారెడ్డి సతీమణికే టికెట్‌ కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమం తమకు విజయాన్ని అందిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. బై పోల్‌పై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్థానిక నేతలతో నియోజకవర్గంలోని గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు.



దుబ్బాకలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ టీఆర్ఎస్‌ అభ్యర్థి సుజాతను గెలిపించాలని కోరుతున్నారు. అధికార పార్టీ కావడం, మొదటి నుంచీ దుబ్బాకలో మంచిపట్టు ఉండటం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశాలుగా మారాయి. ఇప్పటికే వరుసగా రెండుసార్లు టీఆర్‌ఎస్‌ ఇక్కడ విజయం సాధించడంతో ముచ్చటగా మూడోసారి కూడా తామే గెలుస్తామని అధికార పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.



ఇక ఎలాగైనా దుబ్బాక సీట్‌ చేజిక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తమ విజయానికి దోహదపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే తమ పార్టీ ముఖ్యనేతలకు నియోజకవర్గంలోని మండలాల వారీగా బాధ్యతలను అప్పగించింది. అన్ని రంగాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.



పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ ఆయనతో రాయబారం నడిపి పార్టీలో చేర్చుకుంది. దుబ్బాక ప్రాంతంలో చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది.



గతంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే ఈ ఎన్నికలో శ్రీనివాస్‌ రెడ్డి విజయానికి ఉపకరిస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సీనియర్‌ నేత రఘునందన్‌రావు బరిలో దిగారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు దుబ్బాక నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో పరాజయం చవి చూశారు.



2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ మెదక్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసినా రఘునందన్‌కు ఓటమి తప్పలేదు. దీంతో మూడోసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు లబ్ధి చేకూర్చనుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు దుబ్బాక‌లో పార్టీల పరంగా సాగిన పోరు.. ఇప్పుడు అభ్యర్థులు చూట్టూ తిరుగుతోంది. ముగ్గురు అభ్యర్థులూ బ‌ల‌మైన నేప‌థ్యం ఉన్నవారే కావ‌డం ఆసక్తి రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధంతో దుబ్బాకలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది.