Politicians Contest From Two Seats : తెలంగాణలో మూడు పార్టీల కీలకనేతల మధ్య ఆసక్తికర పోరు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కీలక నేతల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్షాల తరపున ఆయా పార్టీల కీలకనేతలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండటంతో వారి మధ్య నెలకొన్న డ్యూయల్ బిగ్ ఫైట్ చర్చనీయాంశంగా మారింది....Telangana Assembly Elections 2023 DUEL BIG FIGHT
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కీలక నేతల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్షాల తరపున ఆయా పార్టీల కీలకనేతలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండటంతో వారి మధ్య నెలకొన్న డ్యూయల్ బిగ్ ఫైట్ చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు కీలక నేతలు ఎవరికి వారు వారి వారి సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ రెండవ స్థానం నుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగారు.
పాత తరం నేతల బాటలో నేటి కీలక నేతలు
గత ఎన్నికల్లో కూడా పాత తరం నేతలు ప్రాంతాల వారీగా రెండేసి, మూడేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సందర్భాలున్నాయి. దీంతో పాత తరం నేతల బాటలో పయనిస్తూ ఈ సారి మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు ఒకరిపై మరొకరు ఎన్నికల సమరాంగణంలో నిలిచారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రనేతల మధ్య కీలక పోరు తెలంగాణ వ్యాప్తంగా ప్రాధాన్యాన్ని చోటుచేసుకుంది. అధికార బీఆర్ఎస్ అధినేత, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సిట్టింగ్ సెగ్మెంట్ అయిన గజ్వేలుతోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పై ఈటెల, రేవంత్ సవాలు
ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటంతో గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ కీలక నాయకుడైన ఈటెల రాజేందర్ కమలం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి సీఎంపై సవాలు విసిరారు. తన సిట్టింగ్ స్థానమైన హుజురాబాద్ తోపాటు గజ్వేల్ బరిలో ఉన్న ఈటెల తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హుజురాబాద్ సిట్టింగ్ స్థానంలో ఈటెల సతీమణి జమున ప్రచార బాధ్యతలు తీసుకోవడంతో ఈటెల సీఎం సిట్టింగ్ స్థానంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ప్రచార జోరు పెంచారు.
కామారెడ్డి బరిలో కీలకనేతల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకం
మరో వైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో తాను ఓటమి పాలైన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి బరిలో నిలిచి సవాలు విసిరారు. గతంలోనూ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, పీవీ నరసింహారావు, చిరంజీవి,రావి నారాయణరెడ్డి, పెండ్యాల రాఘవరావు తదితరులు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ సైతం…రెండు స్థానాల్లో పోటీ
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించాక తిరుపతి, పాలకొల్లు స్థానాల నుంచి పోటీ చేసి తిరుపతిలో విజయం సాధించినా, పాలకొల్లులో పరాజయం పాలయ్యారు. 1985వ సంవత్సరంలో ఎన్టీఆర్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని గుడివాడ, హిందూపురం, నల్గొండ సీట్లలో పోటీ చేసి మూడింట విజయం సాధించారు. హిందూపురం స్థానాన్ని ఉంచుకొని నల్గొండ, గుడివాడ స్థానాలకు రాజీనామా చేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ కల్వకుర్తి, హిందూపురంలో పోటీ చేసి కల్వకుర్తి స్థానంలో ఓటమి పాలయ్యారు.
కమ్యూనిస్టు నేతల పోరు
కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి 1952వ సంవత్సరం ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ, భువనగిరి శాసనసభకు పోటీ చేశారు, రెండుస్థానాల్లో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. మరో కమ్యూనిస్ట్ నాయకుడు పెండ్యాల రాఘవరావు వరంగల్ లోక్ సభతోపాటు వర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి మూడుచోట్లా గెలిచారు.
ముఖ్యమంత్రులు సైతం రెండేసి స్థానాల్లో పోటీ
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి బాదామిలో గెలిచినా, చాముండేశ్వరిలో ఓటమి చవిచూశారు. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి 2018ఎన్నికలలో చెన్నపట్న, రామనగర నియోజకవర్గాల నుంచి పోటీచేసి రెండింటిలోనూ గెలిచారు.
పీవీ నరసింహారావు సైతం …
ఒడిశాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2019లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1996లో పీవీ నరసింహారావు ఒడిశాలోని బరంపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు సీట్లలో పోటీ చేసి రెండు చోట్ల ఘన విజయం సాధించినా, నంద్యాల విడిచి పెట్టారు.
ALSO READ : Telangana assembly election : తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఓటర్లకు తాయిలాలు
ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అటల్ బిహారీ వాజపేయీ,ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్‌కే అడ్వాణీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు.
ALSO READ : Telangana assembly election : తెలంగాణలో త్రిముఖ పోరు…ప్రచార హోరు
మోదీ,సోనియా, అడ్వాణీ, ఇందిర, రాహుల్, ములాయంలు పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. లాలూప్రసాద్ యాదవ్ ఒక స్థానంలో గెలిచినా, రెండో స్థానంలో ఓటమి పాలయ్యారు. వాజ్ పేయి మూడు చోట్ల పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలిచారు.