కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోతున్నాయి. లావాదేవీలు ఆగిపోయాయి. ఎక్కడి ఫైళ్లు అక్కడే ఉండిపోయాయి. పరిపాలన గాడి తప్పుతోంది.
అధికారులు, సిబ్బంది ఇళ్లలో ఉన్నా పనులు ఆగవు:
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం పరిపాలన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టింది. అదే ఈ-ఆఫీస్. అధికారులు, సిబ్బంది ఇళ్లలో ఉన్నా పనులు ఆగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయం సహా ఇతర హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలు పెట్టబోతోంది. జూలై రెండో వారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన మొదలు కానుంది.
ఈ-ఆఫీస్ పై త్వరలో ఉద్యోగులకు ట్రైనింగ్:
రేపటిలోగా(జూల్ 7,2020) ఉద్యోగుల మాస్టర్ డేటా బేస్ రూపొందించాలని, ఈ ఆఫీస్ కు అవసరమయ్యే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ల వివరాలు, డిజిటల్ సంతకాలను సేకరించాలని వివిధ శాఖలకు నోట్ జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఆఫీస్ నిర్వహణ కోసం ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని కూడా నియమించారు. ఇకపై అన్ని లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరగనున్నాయి. ముద్ర సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటల్ సంతకాలు సేకరిస్తారు. భౌతికంగా ఫైళ్ల నిర్వహణతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖల్లో ఈ-ఆఫీస్ విధానం అమల్లోకి రానుంది. ఈ-ఆఫీస్ పై త్వరలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ-ఆఫీస్ కోసం అధికారుల హైరార్కీ మ్యాపింగ్ చేయనున్నారు. ఐటీ శాఖ సాయంతో ఎస్ఓ నుంచి పైస్థాయి అధికారుల వరకూ హైరార్కీ మ్యాపింగ్ చేయనున్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా, ఫైళ్లను నిరంతరం ట్రాక్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Here>> హైదరాబాద్‌లో విషాదం