Harish Rao: సిగాచి బాధితులకు కోటి పరిహారం హామీ ఏమైంది? సీఎం రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ..
పరిహారం కోసం బాధితుల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. పాలకుల మనసు కరగడం లేదని మండిపడ్డారు.
Harish Rao: సిగాచి బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇస్తానన్న హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ కు బహిరంగ లేఖ సంధించారు. నాలుగు నెలలు గడిచినా సిగాచి బాధితులకు పరిహారం అందకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని హరీశ్ రావు నిలదీశారు.
కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బును కూడా ప్రభుత్వం ఇప్పించే నష్ట పరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని విరుచుకుపడ్డారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా సిగాచి బాధితులకు 40 నుండి 50 లక్షల రూపాయలు అందించామని ప్రకటించడం అత్యంత శోచనీయమన్నారు. చికిత్స ఖర్చులను పరిహారంలో కోత విధించడం అమానవీయం అన్నారు.
ఆచూకీ దొరకని 8 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గం అని విరుచుకుపడ్డారు. సిగాచి యాజ్యమాన్యానికి అధికారులు ఏజెంట్లుగా మారారని, బాధితులను చీదరించుకోవడం దారుణం అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన 2 లక్షల పరిహారం బాధితులకు ఇప్పించే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు.
తక్షణమే కోటి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. పరిహారం కోసం బాధితుల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. పాలకుల మనసు కరగడం లేదని మండిపడ్డారు. సిట్ వేయరు, అరెస్టులు చేయరు.. నిస్సిగ్గుగా సిగాచి యాజ్యమాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోంది అని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
Also Read: కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి.. నెక్ట్స్ జరిగేది ఇదే..
