KTR: హిట్ల‌ర్ లాంటి నియంతలకే ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు.. రేవంత్ రెడ్డి ఎంత‌? బుల్డోజ‌ర్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలి- కేటీఆర్

రేవంత్ రెడ్డి త‌న కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు.

KTR: హిట్ల‌ర్ లాంటి నియంతలకే ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు.. రేవంత్ రెడ్డి ఎంత‌? బుల్డోజ‌ర్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలి- కేటీఆర్

Updated On : November 4, 2025 / 12:33 AM IST

KTR: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. బోర‌బండ‌లో ఆయన పబ్లిక్ ను ఉద్దేశించి మాట్లాడారు. బోరబండలో వ‌చ్చిన జ‌నాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ గెలుపు ప‌క్కా అని తేలిపోయిందన్నారు కేటీఆర్. ఇక తేలాల్సింది మెజార్టీ ఎంత అనేది మాత్రమే అన్నారు. కేసీఆర్ తిరిగి ఈ రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క‌రిని కూడా మోసం చేయ‌కుండా విడిచి పెట్ట‌లేదని ఆరోపించారు. హామీలు ఇచ్చి రెండేళ్లైంది.. ఇంకా అమ‌లు కావ‌ట్లేదని విమర్శించారు. స్కూటీలు రాలేదు.. ఇందిర‌మ్మ ఇల్లు రాలేదు.. రూ.4వేలు పెన్ష‌న్ రాలేదు.. ఏ ఒక్క హామీ అమ‌లు కాలేదని ధ్వజమెత్తారు.

”రేవంత్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రేవంత్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే పేద‌ల ఇళ్లు కూల‌గొట్టారు. మ‌హిళ‌ల‌ను మోసం చేశారు. హైద‌రాబాద్‌ను నాశ‌నం చేశారు. రియ‌ల్ ఎస్టేట్‌ను నాశ‌నం చేశారు. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ తెలంగాణ‌ను లాస్ట్ ప్లేస్‌కు దిగ‌జార్చారు. పేద‌ల ఇళ్ల‌పైకి బుల్డోజ‌ర్లు రాకూడ‌దంటే సునీత‌మ్మ‌ను గెలిపించాలి. కారు, బుల్డోజ‌ర్ల మ‌ధ్య ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. బుల్డోజ‌ర్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలి.

హైడ్రా బాధితుల బాధ‌ను చూస్తే ప్ర‌తి ఒక్క‌రికి క‌ళ్ల‌లో నీళ్లు వ‌స్తాయి. హైడ్రా పేరుతో వేలాది మంది ఇళ్ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూల్చింది. హైడ్రా అనే రాక్ష‌సి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేయాలి. ప్ర‌తి పేదవాడికి మేం అండ‌గా నిల‌బ‌డతాం. బుల్డోజ‌ర్ల‌కు అడ్డంగా ప‌డుకుంటాం. సునీత‌మ్మ‌కు అండగా నేనున్నా.. కేసీఆర్ ఉన్నారు. ప‌క్క‌నే తెలంగాణ భ‌వ‌న్ ఉంది.. అర్ధ‌రాత్రి ఫోన్ చేసినా అర గంట‌లో మీ వ‌ద్ద‌కు వ‌స్తాం. కాంగ్రెస్ వాళ్లు భ‌య‌పెడితే.. మేం వ‌చ్చి వాళ్ల సంగ‌తి తేలుస్తాం.

రైతుల‌ను, కౌలు రైతుల‌ను, రైతు కూలీల‌ను ఈ ప్ర‌భుత్వం మోసం చేసింది. ఢిల్లీకి పంపేందుకు పైస‌లు ఉన్నాయి.. కానీ.. పేద‌ల‌కు ఇచ్చేందుకు మాత్రం పైస‌లు లేవు. రేవంత్ రెడ్డి త‌న కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. త‌మ వ‌ద్ద నిధులు లేవ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి బ‌హిరంగంగానే చెప్పారు. 100 కోట్లు కావాలంటూ ప్ర‌పంచ బ్యాంక్‌కు అప్లికేష‌న్ పెట్టుకున్నారు మరో ఎమ్మెల్యే.

నోటిఫికేష‌న్లు లేవు… లూటిఫికేష‌న్ మాత్రం చేస్తున్నారు.

కంటోన్మెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కపైసా కూడా విడుద‌ల చేయ‌లేదు. అక్క‌డ చేయ‌ని అభివృద్ధి.. జూబ్లీహిల్స్ ఎలా చేస్తారో చెప్పాలి. ఏడాదిలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, నిరుద్యోగుల‌కు రూ.4వేలు ఇస్తామ‌ని చెప్పి మాట త‌ప్పారు.
నోటిఫికేష‌న్లు లేవు. కానీ.. లూటిఫికేష‌న్ మాత్రం చేస్తున్నారు.

ఉద్యోగాలు ఇవ్వాలంటున్న‌ నిరుద్యోగుల‌ను లాఠీల‌తో కొడుతున్నారు. ఆడ‌బిడ్డ‌తో పెట్టుకున్న వాళ్లు ఎవ‌రూ బాగుప‌డ‌లేదు. గోపినాథ్ గుర్తుకొచ్చి సునీత‌మ్మ ఏడిస్తే.. కాంగ్రెస్ మంత్రులు ఆమెను అవ‌మానించారు. క‌న్నీళ్ల‌ను కూడా రాజ‌కీయం చేసే దౌర్బాగ్యులు ఈ కాంగ్రెస్ నేత‌లు. ఏం చేసేది లేక‌పోతే.. కుర్చీలో ఎందుకు కూర్చున్నావ‌ని ప్ర‌జ‌లు రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు.

కేసీఆర్ ఉన్న‌ప్పుడు ఎలా ఉండే తెలంగాణ‌.. ఇప్పుడు ఎలా అయ్యిందో అంద‌రూ ఆలోచించాలి. తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి.. మెడ‌లో ఉన్న గొలుసులు కూడా లాక్కొంటున్నారు. స‌ర్దార్ కుటుంబాన్ని కూడా ప్ర‌భుత్వం ఇబ్బంది పెట్టింది. వాళ్ల‌కు పెట్టిన హింస‌కు స‌మాధానం చెప్పాల్సిన టైమ్ వ‌చ్చింది. హిట్ల‌ర్ వంటి నియంత‌ల‌కు కూడా ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. రేవంత్ రెడ్డి ఎంత‌?

హైద‌రాబాద్‌ను బ‌ర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి..

కాంగ్రెస్‌కు ఓటేయ‌క‌పోతే జూబ్లీహిల్స్ ప్రజలకు ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తామ‌ని రేవంత్ బెదిరిస్తున్నారు. ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని ప‌థ‌కాలు బంద్ చేస్తారు? బీఆర్ఎస్‌ను గెలిపించండి.. కాంగ్రెస్ గ‌ల్లా ప‌ట్టి ప‌థ‌కాలు అమ‌లు చేపిస్తాం. రంజాన్ తోఫా లేదు.. బ‌తుక‌మ్మ చీర లేదు.. క్రిస్మ‌స్ గిఫ్ట్ లేదు.. అన్నీ బంద్ అయ్యాయి. హైద‌రాబాద్‌ను బ‌ర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. 4 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌రపున 4 ల‌క్ష‌ల మంది జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు తీర్పు చెప్ప‌బోతున్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞ‌ప్తి. దొంగ ఓట్లు వేస్తారంట.. పైస‌లు ఇచ్చి ఓట్లు కొంటారంట. పైస‌లు ఇస్తే తీసుకొని.. కారు గుర్తుకు ఓటేయాలి” అని ఓటర్లకు పిలుపునిచ్చారు కేటీఆర్.

Also Read: కవితక్క పోల్‌ స్ట్రాటజీ.. సింహం గుర్తుపై ఫోకస్..!