KTR: కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు.. విలీనం ముచ్చటే లేదు.. ఎంపీ సీఎం రమేశ్ కు కేటీఆర్ కౌంటర్..
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట.. హెచ్ సీయూ భూములు తాకట్టు పెట్టి 10వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు..

KTR: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రమేశ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై కేటీఆర్ రివర్స్ అటాక్ కు దిగారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే సీఎం రమేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
సీఎం రమేశ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కలిసి వస్తే స్కామ్ లపై చర్చకు సిద్ధమన్నారు. హెచ్ సీయూలో 10వేల కోట్ల స్కామ్ తో పాటు ఫోర్త్ సిటీలో 1600 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ పైనా చర్చిద్దామని సవాల్ చేసిరారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తెరపైకి విలీనం అంశం తెచ్చారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఇరకాటంలో పడిన ప్రతీసారి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ పార్టీలోనూ బీఆర్ఎస్ విలీనం కాదన్న కేటీఆర్.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు.
”దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ లభించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటుంది? సీఎం రేవంత్, సీఎం రమేశ్.. ఇద్దరి బాగోతం నేను బయటపెట్టడంతో కుడిదిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారు.
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట.. హెచ్ సీయూ భూములు తాకట్టు పెట్టి 10వేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కు పనికి రాని కథలు చెబుతున్నారు. రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.
నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ పనికిరాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే.. హెచ్ సీయూ 10000 కోట్ల స్కాం పైన, 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కామ్ పైన కలిసి చర్చ కు సిద్ధం” అని కేటీఆర్ అన్నారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవనే ఈ కుట్రలు- కేటీఆర్
”కేఆర్ ను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ దాడి చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని చూసి దేశం నివ్వెర పోయింది. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు స్వర్ణయుగం. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారు. కాళేశ్వరం కట్టి ప్రపంచంలో తెలంగాణను హిమాలయాల ఎంత ఎత్తులో నిలిపారు కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టును లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనే అనుమానం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయి. కాళేశ్వరం కూలేశ్వరం అని రోజూ ఓ సన్నాసి మాట్లాడుతున్నాడు.
మమ్మల్ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులకు మేలు చేసినందుకు మమ్మల్ని ఉరి తీయాలా? చంద్రబాబు కోవర్టులు అన్ని పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెబుతున్నారు. తెలంగాణకు పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవని
గులాబీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది. నా చెంచా రేవంత్ ఉన్నాడని చంద్రబాబు అనుకుంటున్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఫోన్ ట్యాపింగ్ లో పసలేదని పోలీసులే చెబుతున్నారు. మా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మెడకాయ మీద తలకాయ ఉండి పని చేస్తున్నారా అని డీజీపీని ప్రశ్నిస్తున్నా. పోలీసు అధికారి ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి.
మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం. బీఆర్ఎస్వీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి.
కేసులకు భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవటానికి పార్టీ లీగల్ సెల్ ఉంది. గట్టిగా పోరాడే వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ జల హక్కులకు పిండం పెడుతుంటే మనం ఊరుకుందామా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టండి” అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్.