నా ఫామ్‌హౌస్‌ను నేనే కూల్చేస్తా..!- మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ..

తనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వెంటనే అధికారులతో పూర్తి సర్వే చేయించాలని,

నా ఫామ్‌హౌస్‌ను నేనే కూల్చేస్తా..!- మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ..

KVP Ramachandra Rao (Photo Credit : Google)

Updated On : October 4, 2024 / 5:25 PM IST

K. V. P. Ramachandra Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. మూసీ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ మూసీ బఫర్ జోన్ లోనే తన ఫామ్ హౌస్ ఉంటే.. 48 గంటల్లో తానే తన సొంత ఖర్చులతో ఫామ్ హౌస్ ని కూల్చేస్తానని కేవీపీ స్పష్టం చేశారు. మార్కింగ్ తేదీ, సమయం ముందే ప్రకటించాలని, తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియాను తీసుకొచ్చి సర్వే చేయించాలని విజ్ఞప్తి చేశారు కేవీపీ. తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అని కేవీపీ స్పష్టం చేశారు.

”జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా.. అది కూలగొట్టాలా? వద్దా? చెప్పు. అజీజ్ నగర్ లో హరీశ్ రావుకి ఉన్న ఫామ్ హౌస్ అక్రమమా? కాదా? దాన్ని కూలగొట్టాలా వద్దా చెప్పు. సబితమ్మ.. నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్ లు కట్టావు కదా.. పేద అరుపులు అరవొద్దమ్మా. నీ ఫామ్ హౌస్ లెక్కలు కూడా ఉన్నాయి. కూలగొట్టాల? వద్దా? సబితమ్మ.. నువ్వు సలహాలు చెప్పు. మీకు వెనకున్న కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ కూలగొట్టాలా వద్దా? ఇవాళ అక్రమంగా ఫామ్ హౌస్ లు నిర్మించుకుని, మీ ఫామ్ హౌస్ లపై ఎక్కడ తొలగింపు వేటు పడుతుందో అనే భయంతో పేదలను రక్షణ కవచంగా పెట్టుకుని మీరు నాటకాలు ఆడుతున్నారు” అంటూ ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

హైడ్రా కూల్చివేతల అంశంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై నిన్న తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తిన ఆయన.. కేవీపీ పేరుని కూడా ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ లను హైడ్రా కూలుస్తుందన్న భయంతోనే.. పేదలను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తాజాగా దీనిపై మాజీ ఎంపీ కేవీపీ సీఎం రేవంత్ కు లేఖ రాశారు.

తన ఫామ్ హౌస్ కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్నారని, తనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వెంటనే అధికారులతో పూర్తి సర్వే చేయించాలని, ఒకవేళ మూసీ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉంటే, తనకు 48 గంటల సమయం ఇస్తే తానే తన సొంత ఖర్చులతో తన ఫామ్ హౌస్ ను కూల్చేయిస్తానని లేఖలో స్పష్టం చేశారు కేవీపీ. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని కేవీపీ అన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ మూసీ ప్రక్షాళనకు సంబంధించి నాటి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందన్నారు. ఏది ఏమైనా మీరు సమర్ధవంతమైన నాయకుడిగా ఒక నిర్ణయం తీసుకుని, మూసీ ప్రక్షాళనకు నడుం కట్టారు, కచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా.. మూసీ ప్రక్షాళనకు, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కేవీపీ వెల్లడించారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని కేవీపీ అన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తే నా కాంగ్రెస్ రక్తం సహించదన్నారాయన.

 

Also Read : అటు స్టడీ టూర్లు, ఇటు ఆఫీస్ రినోవేషన్లు..! అధికారుల జల్సాలకు కేరాఫ్‌గా బల్దియా..!