మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత..

2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన నాగ్ పూర్ జైల్లో ఉన్నారు.

మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత..

Professor Saibaba Passed Away (Photo Credit : Google)

Updated On : October 13, 2024 / 12:14 AM IST

Professor Saibaba : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన.. గుండెపోటుతో మరణించారు. 10 రోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరారు సాయిబాబా. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబా అరెస్ట్ అయ్యారు. 2017లో సాయిబాబాకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన నాగ్ పూర్ జైల్లో ఉన్నారు. ఇటీవల నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ రాత్రి 8గంటల 45 నిమిషాలకు నిమ్స్ లో తుది శ్వాస విడిచారు.

అనారోగ్య సమస్యలతో సాయిబాబా కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(అక్టోబర్ 12) కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన సాయిబాబా.. పోలియో కారణంగా ఐదేళ్ల వయసు నుంచే వీల్ ఛైర్ ఉపయోగిస్తున్నారు.

అమలాపురంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సాయిబాబా వామపక్షాల వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ లో 1992లో చేరారు. దశలవారిగా అనేక కార్యక్రమాలు చేశారు. పౌర హక్కుల కోసం ఆయన సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేశారు. మావోయిస్టులకు సానుభూతిపరుడిగా ఉన్నారనే ఆరోపణలతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

ఈ ఏడాది మార్చిలో ఆయన నాగపూర్ జైలు నుంచి నిర్దోషిగా రిలీజ్ అయ్యారు. అయితే, 9 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. మానవ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ గా, విజ్ఞానిగా, మేధావిగా సాయిబాబా గుర్తింపు పొందారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు పొందారు. 2014 నుంచి 2016 వరకు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.

మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారంటూ.. 2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబా తోబు పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. సాయిబాబా, మహేశ్ కరిమన్ టిర్కి, కేశవదత్తా మిశ్రా, పండూ పొర నరోటే, ప్రశాంత్ రాహిలకు జీవిత ఖైదు పడింది. 2017 నుంచి 2024 మార్చి 6 వరకు నాగ్‌పూర్‌ జైలులో సాయిబాబా ఉన్నారు. కాగా, తాను చనిపోయిన తర్వాత మరొకరికి కంటి చూపును అందించేందుకు తన కళ్లను దానం చేశారు సాయిబాబా.

రాందేవ్, మాజీ ప్రొఫెసర్ సాయిబాబా తమ్ముడు..
15 రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్ లో సాయిబాబాను అడ్మిట్ చేశాం. గాల్ బ్లాడర్ లో సమస్య వచ్చింది. ఆపరేషన్ అయిపోయాక ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. నిమ్స్ వైద్యులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సాయిబాబా మరణం పీడిత ప్రజలు, ఆదివాసులకు తీరని లోటు. ఇప్పుడే మరణ వార్త తెలిసింది. వివిధ ప్రాంతాల నుండి స్టూడెంట్స్, ఇతరులు వస్తున్నారు. ఆదివారం ఉదయం మౌలాలిలోని నివాసానికి పార్థివదేహం తరలిస్తాం. అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ అనేది మాట్లాడుకుని చెప్తాం.

Also Read : జగన్‌ గుడ్‌బుక్‌.. రెడ్‌బుక్‌కు కౌంటరేనా? క్యాడర్‌, లీడర్లలో భరోసా కల్పించే స్ట్రాటజీనా?