Raids On Hotels : వామ్మో.. ఇంత ఘోరమా? హైదరాబాద్ హోటల్స్‌లో షాకింగ్ దృశ్యాలు

మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Raids On Hotels : వామ్మో.. ఇంత ఘోరమా? హైదరాబాద్ హోటల్స్‌లో షాకింగ్ దృశ్యాలు

Updated On : May 19, 2024 / 9:39 PM IST

Raids On Hotels : హైదరాబాద్ లో బడా హోటళ్లు, రెస్టారెంట్లు లైటింగ్స్ తో కనువిందు చేస్తాయి. ఇక లోపలికి వెళితే మహా విందును రుచి చూపిస్తాయి. ఇంకో అడుగు ముందుకేసి కిచెన్ లోకి వెళితే ఆహారం ఏమో కానీ, కంగు తినడం మాత్రం ఖాయం. అందుకే, హోటల్స్ నిర్వహకులు… కిచెన్ ముందు Others Are Not Allowed అంటూ ఓ బోర్డు తగిలిస్తారు. అయితే, కిచెన్ లోకి వెళ్లి చూస్తే భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి ఆహారమా మనం డబ్బులు పెట్టి తింటున్నది అని అనుకోకుండా ఉండలేము.

తాజాగా హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు, హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగరలోని పలు హోటల్స్ లో ఏక కాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. నకిలీ, కల్తీ పదార్ధాలతో ఆహారం వండి వడ్డిస్తున్నారు. లక్డీకాపూల్ లోని రాయలసీమ రుచులు, షా గౌస్ రెస్టారెంట్లకు వెళ్లిన ఆహార భద్రత అధికారులు షాక్ కి గురయ్యారు. అక్కడ నాణ్యత కనిపించదు. శుభ్రత లోపించింది. ఏ డబ్బా ఓపెన్ చేసినా పురుగులే. ఏ వస్తువును జరిపినా ఎలుకలే. మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇక కాలం చెల్లిన ఆహార పదార్ధాలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా నాలుగైదు రోజుల క్రితంవే. ఇలా పాడైన పదార్దాలతోనే వంటకాలు చేస్తున్నారు. వాటిని కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అధికారుల సోదాల్లో విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. హాటల్స్ నిర్వాహకులు ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదు. ఇక పరిశుభ్రత ఊసే లేదు.

హోటల్స్ నుంచి సేకరించిన ఆహార పదార్ధాలను అధికారులు ల్యాబ్ కి పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్స్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

చాలామంది హోటల్స్, రెస్టారెంట్స్ కి వెళ్లి వెరైటీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఆశిస్తారు. కుటుంబసభ్యులలో కలిసి హోటల్స్ కు వెళ్లే వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారంతా అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే మీ ప్రాణాలను మీరే పణంగా పెట్టిన వారు అవుతారు. డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని, జబ్బులను కొనుక్కున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.