కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హరీశ్ రావు ప్రెజెంటేషన్.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి.. మేడిగడ్డ వద్ద అసలేం జరిగిందో క్లుప్తంగా వివరించిన మాజీ మంత్రి
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Kaleshwaram Project Presentation: కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించామని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకోసమే పనిచేయాలని అధినేత కేసీఆర్ మాకు ఎప్పుడు చెబుతుంటారని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార. కేవలం రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అన్నారు.
కాళేశ్వరం అంటే ఏమిటి..?
పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కాళేశ్వరం అంటే.. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం అని హరీశ్ రావు చెప్పారు.
మొత్తం కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు ఉన్నాయని. వాటిలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్, సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్, అన్నారం బ్యారేజీలో 64 పియర్స్ ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిలో మేడిగడ్డ బ్యారేజ్ లోని కేవలం రెండు పియర్స్ మాత్రమే కుంగాయని, అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. మొత్తం కాళేశ్వరమే కుప్పకూలిందని దుష్ప్రచారం చేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. మేడిగడ్డలో ఏడు బ్లాక్ లు ఉన్నాయి.. ఒక్కో బ్లాక్ లో కొన్ని పియర్స్ ఉన్నాయి. మొత్తంగా 85 పియర్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే మొత్తం బ్యారేజీ ఇంపాక్ట్ అవుతుంది.. కేవలం రెండు పియర్స్ వల్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని హరీశ్ రావు అన్నారు.
కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతాం..
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతాయని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ కు మేము భయపడ్తున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని హరీశ్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు వాస్తవాలను తీసుకెళ్తాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు మేము భయపడతామా..? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషజాలకు పోకుండా మేడిగడ్డ పిల్లర్ రిపేర్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.