Kunja Satyavathi Passed Away : తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో హఠాన్మరణం చెందారు.

Kunja Satyavathi Passed Away : తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం

Kunja Satyavathi

Updated On : October 16, 2023 / 9:52 AM IST

Kunja Satyavathi : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశారు. కుంజా సత్యవతి మృతిపట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Israel Hamas War : హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే సమయంలో వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్

కుంజా సత్యవతి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆమె సీపీఎం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 1991లో భద్రాచలం ఎంపీపీగానూ పనిచేశారు. అయితే, వైఎస్ఆర్ చొరవతో 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి కుంజా సత్యవతి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొద్దికాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినా.. ఆ తరువాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ సీపీలో చేరారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తరువాత బీజేపీలో చేరారు. అయితే, ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మృతిచెందడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

కుంజా సత్యవతి ఆకస్మిక మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికోసం ఆమె ఎప్పుడూతపనపడేవారని, ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజా సంక్షేమం విషయంలో తన గొంతుకని బలంగా వినిపించేవారని కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.