Ghanpur Station Constituency : స్టేషన్ ఘన్‌పూర్‌లో అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదా?
స్టేషన్ ఘన్‌పూర్ సెగ్మెంట్‌లో.. అధికార బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కుతుందా? విపక్షాల నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు?

Ghanpur Station Assembly Constituency: స్టేషన్ ఘన్‌పూర్.. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపించిన పేరు. ఇక్కడ జరిగే రాజకీయ పరిణామాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో.. రాజకీయం అంతకుమించి రసవత్తరంగా ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గానికి చెందిన నేతలకే.. డిప్యూటీ సీఎం యోగం దక్కింది. ఒకప్పుడు వాళ్లిద్దరూ రాజకీయ విరోధులు. ఇప్పుడు మాత్రం ఒకే పార్టీకి చెందిన నాయకులు. అయినా సరే.. వైరం ముదిరిందే తప్ప.. ఎక్కడా తగ్గలేదు. దాంతో.. స్టేషన్ ఘన్‌పూర్‌లో అధికార పక్షం వాళ్లదే.. ప్రతిపక్ష పాత్ర వాళ్లదే. ఇలాంటి సెగ్మెంట్‌లో.. అధికార బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కుతుందా? విపక్షాల నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు? ఓవరాల్‌గా.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించారు. వాళ్లిద్దరూ.. ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్లే. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి(Kadiyam Srihari). వీళ్లిద్దరూ.. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు.. వేర్వేరు పార్టీల్లో ఉంటూ.. నువ్వా-నేనా అనే స్థాయిలో ఉండేవాళ్లు. ఇప్పుడు.. ఒకే పార్టీలో ఉంటూ.. ఒకే జెండా కింద పనిచేస్తూ.. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం (Ghanpur Station Constituency) 1957లో ఏర్పడింది. మొదట్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం.. తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు మళ్లింది. ఇప్పుడు.. గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. స్టేషన్ ఘన్‌పూర్‌కు ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో ఆరు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం 4 సార్లు విజయం సాధించింది. బీఆర్ఎస్ ఇప్పటివరకు 4 సార్లు గెలుపు జెండా ఎగరేసింది. ప్రస్తుతం.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య.. వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ తరఫున మూడుసార్లు గెలిచారు. ఇక.. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో.. ఏడు మండలాలున్నాయి. అవి.. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, ధర్మసాగర్, వేలేరు, జఫర్‌గఢ్. ఈ సెగ్మెంట్‌లో మొత్తం.. 2 లక్షల 34 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. లక్షా 35 వేల మంది దళిత ఓటర్లే ఉన్నారు. ఇందులోనూ.. మాదిక సామాజికవర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. బీసీల ఓట్ బ్యాంక్ 60 వేలకు పైనే ఉంది. ఓసీలు 25 వేల మంది దాకా ఉన్నారు.
రాజయ్య.. కడియం శ్రీహరి ఇద్దరూ ఒకే పార్టీలో పనిచేస్తున్నా.. వీళ్లిద్దరి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో.. ఘన్‌పూర్ బీఆర్ఎస్‌లో ఎప్పుడూ హీట్ కొనసాగుతూనే ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైరం.. బీఆర్ఎస్‌కి ప్రతి ఎన్నికలో జీవన్మరణ సమస్యగా మారుతోంది. టికెట్ విషయంలో.. ఇద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా కొనసాగుతుండటంతో.. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తనకే వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు ఎమ్మెల్యే రాజయ్య. మరోవైపు.. తన కూతురుని రాజకీయాల్లో సెట్ చేయాలని ఆశ పడుతున్నారు కడియం. అందువల్ల.. రాబోయే ఎన్నికల్లో తనకు గానీ, తన కూతురు కావ్యకు గానీ టికెట్ దక్కించుకోవడనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే.. ఆసక్తిగా మారింది. పూర్తిగా మాదిగ సామాజికవర్గం ఓటర్లనే నమ్ముకొని ఉన్నారు రాజయ్య. కడియం కూడా దళిత ఓటర్లతో పాటు మిగతా సామాజికవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. దానికి తోడు.. ఆయన్ని నిత్యం ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంది. ఇటీవల.. బీఆర్ఎస్(BRS Party)కు చెందిన ఓ మహిళా సర్పంచ్.. ఎమ్మెల్యే రాజయ్య టార్గెట్‌గా చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారం వెనుక కడియం ఉన్నారనే అనుమానం రాజయ్య వర్గంలో ఉంది. రాజయ్య చుట్టూ ముసురుకున్న వివాదాలతో.. టికెట్ తమకే దక్కుతుందనే ధీమాలో ఉంది కడియం వర్గం.
Also Read: పటాన్‌చెరులో గెలిచే పఠాన్ ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?
స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆఖరి ఎమ్మెల్యే.. తాటికొండ రాజయ్యే(Thatikonda Rajaiah). ఆయన.. కారెక్కిన తర్వాత.. ఎన్నికల పోరులో.. కాంగ్రెస్ వెనుకబడిపోతూ ఉంది. గత రెండు ఎన్నికల్లో.. ఇక్కడ హస్తం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. రాజారపు ప్రతాప్.. పార్టీని వీడిన దగ్గర్నుంచి.. గ్రామీణ స్థాయిలో పార్టీ చిన్నాభిన్నమైంది. గత ఎన్నికల్లో.. సింగపురం ఇందిర (singapuram indira) పోటీ చేసినా.. పరిస్థితిలో మార్పు లేదు. అయినప్పటికీ.. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ ఎక్కువే ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఇందిర.. ఈసారి కూడా టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోటరీగా ముద్రపడిన దొమ్మాటి సాంబయ్య (dommati sambaiah).. ఈసారి టికెట్ తనకు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్ కూడా.. అప్పుడప్పుడు ఘన్‌పూర్ బరిలో తానూ ఉంటానని సన్నిహితుల దగ్గర చెబుతుంటారు. కానీ.. వీళ్లెవరూ.. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో అంతగా యాక్టివ్‌గా లేరని క్యాడర్‌లో టాక్ వినిపిస్తోంది. అంతా.. చుట్టపు చూపుగా రావడం, తప్పనిసరి పరిస్థితుల్లో.. మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్.
ఇక.. బీజేపీ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు (Gunde vijaya rama rao), మాదాసు వెంకటేశ్, బొజ్జపల్లి ప్రదీప్ పేర్లు.. టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్. కానీ.. వీళ్లెవరూ.. ఘన్‌పూర్‌లో యాక్టివ్‌గా లేరు. పైగా.. ఈ నియోజకవర్గంలో బీజేపీకి గ్రౌండ్ లెవెల్‌లో చెప్పుకోదగ్గ బలం కూడా లేదు. కానీ.. ఈ మధ్యకాలంలో కమలం పార్టీకి కొంత గ్రాఫ్ మెరుగైనట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా.. యువతలో క్రేజ్ కనిపిస్తోంది. అయినప్పటికీ.. కాషాయం పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందనే చర్చ జరుగుతోంది. లోకల్‌లో పొలిటికల్ వెదర్ కూడా అలాగే ఉందనే టాక్ వినిపిస్తోంది.
Also Read: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?
స్టేషన్ ఘన్‌పూర్‌లో.. వామపక్ష పార్టీలకు చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్పప్పటికీ.. పోటీ నామ మాత్రమే అంటున్నారు. ఇండిపెండెంట్లు, వైఎస్సార్‌టీపీ ప్రభావం అంతంతమాత్రమే. కానీ.. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. బీజేపీ లాంటి పార్టీని వెనక్కి నెట్టి.. బీఎస్పీ మూడో స్థానానికి చేరే అవకాశం ఉందంటున్నారు. ఓవరాల్‌గా.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. అధికార పార్టీలో వర్గ విభేదాలు పరిష్కరించుకోకపోతే.. గట్టి పోటీ ఎదురవక తప్పదంటున్నారు. ఇంతలోపే.. అధిష్టానం అలర్ట్ అయి.. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చితే.. బీఆర్ఎస్ గెలుపు సులువవుతుందని అంటున్నారు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గనక.. ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇదే గనక జరిగితే.. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకుకు గండి పడే అవకాశాలున్నాయి. అప్పుడు.. బీజేపీ (BJP) నామమాత్రపు పోటీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా.. నిత్యం వార్తల్లో నిలిచే స్టేషన్ ఘన్‌ఫూర్‌లో.. ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది.. ఆసక్తి రేపుతోంది.