Gossip Garage: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ రివర్స్ అయ్యిందా? అసలుకే ఎసరు తెచ్చేలా ఉందా?
అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఇల్లు రాలేదు. ఇల్లు వచ్చినోళ్లందరూ పనులు మొదలు పెట్టడం లేదు. లిస్ట్‌లో తమ పేరు లేనోళ్లు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

Indiramma indlu
Gossip Garage: ఒక్కో పథకం చిన్న మెల్లగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ లోపే లోకల్ బాడీ పోల్స్‌కు నోటిఫికేషన్ ఇద్దాం. అలా చేస్తే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో మనదే విజయం అనుకున్న హస్తం పార్టీకి అనుకోని అడ్డంకి వచ్చి పడిందట. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జనం ఆషాడం సెంటిమెంట్‌తో..హస్తం పార్టీకి మైలేజ్ టెన్షన్ పట్టుకుందట. ఇప్పుడేం చేద్దామంటూ డైలమాలో పడ్డారట అధికార పార్టీ నేతలు. ఇందిరమ్మ ఇళ్లు అడ్వాంటేజ్‌గా మారుతాయనుకుంటే..అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయని టెన్షన్ పడుతున్నారట. ఇంతకు ఇందరమ్మ ఇళ్ల మంజూరులో ఏమైంది.? ఇండ్లు సాంక్షన్ అయినా లబ్ధిదారులు ఎందుకు పనులు స్టార్ట్ చేయడం లేదు?
అనుకున్నదొకటి.. అయ్యిందొక్కటి అన్నట్లుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు..ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకెళ్లాలని స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లతో ఎంతో పాజిటివ్ టాక్ వస్తుందని భావించిన అధికార పార్టీకి..ఆషాడం సెంటిమెంట్ రివర్స్ షాక్ ఇస్తుందట.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ పెద్దల ఆలోచన ఒకటైతే..గ్రౌండ్‌లో పరిస్థితి డిఫరెంట్‌గా ఉందట. అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఇల్లు రాలేదు. ఇల్లు వచ్చినోళ్లందరూ పనులు మొదలు పెట్టడం లేదు. లిస్ట్‌లో తమ పేరు లేనోళ్లు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడేం చేయాలని తలలు పట్టుకుంటున్నారట కాంగ్రెస్ లీడర్లు.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను కేటాయించింది ప్రభుత్వం. ఈ లెక్కన ఊరుకు 30 నుంచి 40 ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి. ఆ 40 ఇండ్లు అయినా ఇస్తే జనంలో ఆశ కలుగుతుందని..దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తారని ఆశించారట హస్తం పార్టీ నేతలు. అయితే ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఇండ్ల మంజూరుకు చాలామంది అర్హత సాధించలేకపోయారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 లక్షల 15 వేల మందికి మాత్రమే ఇండ్లు సాంక్షన్ అయ్యాయి. ఇక ఒక్కో ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం..బిల్లుల మంజూరుకు కూడా కొన్ని కండీషన్స్ పెట్టింది. పునాది వేశాక లక్ష రూపాయలు.. గోడల వరకు వచ్చాక లక్ష 25 వేల రూపాయలు.. స్లాబ్ బడిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు ఇస్తామంటోంది. ఇక ఫైనల్‌గా రంగులు వేసిన తర్వాత మరో లక్ష రూపాయలను ఇస్తామంటోంది ప్రభుత్వం. ఇదే లబ్ధిదారులకు నచ్చడం లేదట. కొందరేమో ఇల్లు స్టార్ట్ చేసేందుకు తమ దగ్గర డబ్బులు లేక ముగ్గు కూడా పోయడం లేదట. మరికొందరేమో ఆషాడం సెంటిమెంట్‌తో ఇండ్లు మొదలు పెట్టడం లేదట.
ఇక లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వారేమో ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారట. ఇదంతా గమనిస్తున్న హస్తం పార్టీ నేతలు ఎక్కడో తేడా కొడుతుంది శీనా అనుకుంటున్నారట. ఎంతో కలిసి వస్తుందనుకున్న ఇళ్ల స్కీమ్ మొదటికే మోసం తెచ్చేలా ఉందని టెన్షన్ పడుతున్నారట.
ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 నుంచి 600 అడుగుల వరకు ఉండాలనే నిబంధనను కూడా పబ్లిక్‌కు నచ్చడం లేదట. 600 అడుగలలోపు నిర్మాణం చేసుకుంటామని లబ్ధిదారులు అంగీకారపత్రం రాసిచ్చిన తర్వాతే వారికి బిల్లుల మంజూరు, ఇసుకకు అనుమతులను ఇస్తున్నారట. ఈ రూల్స్‌తో కూడా కొందరు ఇండ్లు స్టార్ట్ చేయడం లేదట. దీంతో తొలి విడతలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు పొందిన 47వేల 235 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 38శాతం మంది అంటే 17వేల 982మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారట.
కొందరు అయితే తమకు ఇళ్లు వద్దని కూడా చెబుతున్నారట. పెట్టుబడి లేక కొందరు ఇల్లు స్టార్ట్ చేయలేకపోతుంటే..ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న వారు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదట. బిల్లులు వస్తాయో, రావోననే ఆందోళన చాలామందిలో ఉందట.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేర్చామని చెప్పుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడుగుదామనుకున్న హస్తం పార్టీకి ఇవన్నీ ఇబ్బందులు వచ్చి పడ్డాయట. దీంతో గ్రామాల్లో సానుకూలతకు బదులు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని..ఆందోళన చెందుతున్నారట. ఇండ్ల మంజూరు, నిర్మాణానికి పెట్టిన రూల్స్‌లో కొన్ని సడలిస్తే బాగుండేదని కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డులో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఏదైనా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అనుకున్నంత మైలేజ్ రాదేమోనన్న భావనలో అయితే హస్తం పార్టీలో ఉందంటున్నారు.