Gossip Garage : రసవత్తరంగా జగిత్యాల రాజకీయం.. ఎవరూ ఊహించని శైలిలో ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ చాణక్యం..!

ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని... పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Gossip Garage : రసవత్తరంగా జగిత్యాల రాజకీయం.. ఎవరూ ఊహించని శైలిలో ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ చాణక్యం..!

Gossip Garage : జగిత్యాల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. లోకల్ పాలిటిక్స్‌లో రోజుకో ట్విస్ట్.. హీట్ పుట్టిస్తోంది. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్… కాంగ్రెస్ శ్రేణులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అటు బీఆర్ఎస్ క్యాడర్ తనకు దూరమవకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే…. కాంగ్రెస్‌లో చేరడం గులాబీ దళానికి షాకిస్తే… ఆయన రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వర్గం చేసిన హడావుడితో కాక పుట్టించింది. ఈ పరిస్థితుల్లో అందరూ సంజయ్ పద్మవ్యూహంలో చిక్కుకున్నాడనే అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తనదైన శైలిలో సంజయ్ చేస్తున్న రాజకీయ చాణక్యం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

జీవన్ రెడ్డికి పెద్ద పేట? ఆందోళనలో సంజయ్ వర్గీయులు..!
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో హస్తం గూటికి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్…. పొలిటికల్ ఫ్యూచర్ ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరిన సంజయ్‌ను కాంగ్రెస్ స్థానిక లీడర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ పార్టీలో సంజయ్ కొనసాగడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్‌ను ఢీకొట్టి ఓడిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామా హెచ్చరిక కాంగ్రెస్‌లో కాకరేపింది. పార్టీ బుజ్జగింపులతో మెత్తబడ్డ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ లో పెద్దపీట వేయనున్నారనే టాక్.. ఎమ్మెల్యే సంజయ్‌ వర్గాన్ని గందరగోళానికి గురిచేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోణంలో పార్టీ మారినా, మళ్లీ జీవన్ రెడ్డి డామినేషన్ చేసే స్థితిలో ఉంటే తమ నాయకుడి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందారు సంజయ్‌ కుమార్ వర్గీయులు.

ప్లేట్ ఫిరాయించడాన్ని గులాబీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది..
ఇదే సమయంలో బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేపై ఆ పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో కారాలు మిరియాలు నూరుతూ వచ్చారు. సంజయ్ ని కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడాన్ని గులాబీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. పైగా ఎమ్మెల్సీ కవిత కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించిన సంజయ్ ఇంత సడన్‌గా పార్టీ మారుతారని ఊహించలేదు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. కానీ ఎమ్మెల్యే ఆకస్మిక నిర్ణయంతో వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ హైకమాండ్, ఎమ్మెల్యే వెంట కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది.

ఎవరూ ఊహించనిరీతిలో అపూర్వ స్వాగతం..
ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ రాజకీయాలను గమనించిన ఎమ్మెల్యే సంజయ్… తన మార్కు పాలిటిక్స్‌తో జగిత్యాలలో ఎంట్రీ ఇవ్వడం మొత్తం ఎపిసోడ్‌లో హైలెట్‌గా మారింది. ఎమ్మెల్యే రాకను వ్యతిరేకించిన కాంగ్రెస్ క్యాడర్‌ను… పార్టీ వీడిన సంజయ్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన గులాబీ దళాన్ని చాకచక్యంగా తన దారిలోకి తెచ్చుకున్నారు ఎమ్మెల్యే సంజయ్. పార్టీ మారిన తర్వాత తొలిసారిగా జగిత్యాలలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే సంజయ్ కు ఎవరూ ఊహించనిరీతిలో అపూర్వ స్వాగతం లభించింది. రెండు పార్టీల నుంచి భారీగా చేరుకున్న కార్యకర్తలు.. ఎమ్మెల్యేకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం పార్టీ మారిన సంజయ్… రెండు పార్టీల్లోనూ క్యాడర్‌ను ఆకర్షించి తన దారిలోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయినట్లే చెబుతున్నారు.

స్వాగతం పలికిన 20మందికిపైగా కౌన్సిలర్లు..
సంజయ్ పార్టీని వీడటంతో కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు సోమవారం జగిత్యాలలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…. ఎమ్మెల్యే వెళ్లినా నష్టం లేదని.. పార్టీ క్యాడర్‌ను ఎమ్మెల్యే టచ్ చేయలేరని చెప్పారు. అయితే కేటీఆర్ మీటింగ్‌కి కేవలం ఇద్దరే బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కావడం… మిగిలిన 20 మందికి పైగా కౌన్సిలర్లు జగిత్యాలలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే సంజయ్‌కు స్వాగతం పలకడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే తాజా మాజీ సర్పంచ్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం పార్టీలను పక్కన పెట్టి సంజయ్ పక్కన చేరడంతో బీఆర్ఎస్ వర్గాలు షాక్ తిన్నాయి.

పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు..
అదే సమయంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వైఖరితో ఎమ్మెల్యే సంజయ్‌ను జగిత్యాలలో ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఉత్కంఠ వీడిపోయింది. ఆ పార్టీ క్యాడర్ సైతం భారీ సంఖ్యలో తరలిరావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఇటు జీవన్‌రెడ్డి, అటు బీఆర్ఎస్ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి చేయాలని చూడటంతో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఎమ్మెల్యే ఇబ్బందులు పడతారనే అంతా అనుకున్నారు. కానీ, ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని… పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Also Read : కనీసం ముఖం కూడా చూపెట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డిని లైట్‌ తీసుకున్న ఎమ్మెల్యే..! ఎందుకీ ధిక్కార స్వరం?