Komatireddy Rajgopal Reddy: రాజన్నకు ఏమైంది? జూబ్లీహిల్స్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?
ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలకు తెలంగాణ ముఖ్యనేతల దగ్గర సమాధానం లేదంటున్నారు.
Komatireddy Rajgopal Reddy: సీఎం నుంచి మంత్రుల వరకు..ఎమ్మెల్యేల నుంచి కార్పొరేషన్ ఛైర్మన్ల వరకు..హస్తం పార్టీ చోటామోటా లీడర్లు అంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్నారు. ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఏ నేత ప్రచారంలో పాల్గొనకపోయినా ప్రశ్నిస్తున్న పార్టీ పెద్దలు..ఆ ఎమ్మెల్యేకు ఫోన్ చేయాలంటేనే జంకుతున్నారట. పైగా మొన్నటివరకు మంత్రినంటూ హల్‌చల్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా కాబోయే సీఎం అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారట. ఇంతకు ఎవరా నేత? జూబ్లీహిల్స్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ లీడర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. మంత్రులతో మొదలుకొని, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, క్యాడర్ మొత్తం రంగంలోకి దిగి గల్లీలు, బస్తీలను చుట్టేస్తున్నారు. ఒక్కొక్క డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున మొత్తం ఏడు డివిజన్లకు 14 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరికి, కార్పొరేషన్ ఛైర్మన్లు క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇప్పటివరకు ఆయన జూబ్లీహిల్స్‌వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎన్నికల ఆపరేషన్‌లో రాజగోపాల్ రెడ్డి స్ట్రాటజీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో టాక్. అందుకే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తే..కేవలం ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ సీటును గెలిపించాల్సిందిగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి .. రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. రాజగోపాల్ రెడ్డి చార్జ్ తీసుకున్నాకే..భువనగిరిలో పరిస్థితి కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు.
రెండోసారి మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమన్న టాక్..
భువనగిరి పార్లమెంట్ సీటు గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి పార్టీపై ప్రెజర్ పెంచారు. మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని పట్టుబడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి విషయంలో పలుసార్లు అధిష్టానం దగ్గర కూడా చర్చలు జరిగాయి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రాజగోపాల్‌కు బెర్త్ ఖాయమన్న టాక్ వినిపించింది. కానీ సామాజిక సమీకరణాలు, జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ వర్కౌట్ కాకపోవడంతో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉంటున్నారు.
ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌ను ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంతే అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మునుగోడులో మంత్రి రాజగోపాల్ రెడ్డి అంటూ అనుచరులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి రాజన్న అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు ఆయన ఫ్యాన్స్. పైగా ఇప్పుడు రాజన్న అప్‌కమింగ్ సీఎం అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు.
ఇదంతా ఒక ఎత్తయితే..లేటెస్ట్‌గా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మైనారిటీ కోటాలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆలోచనకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విస్తరణలో కేవలం అజారుద్దీన్ ఒక్కరికి మాత్రమే పరిమితం చేయడంతో రాజగోపాల్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించిందట. రెండోసారి జరిగిన మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా నెక్ట్స్ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారట. అప్పట్లో స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజగోపాల్‌రెడ్డికి సర్దిచెప్పారు. కానీ ఇప్పుడు కూడా తనకు ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదంటూ ఫైర్ అవుతున్నారు.
భట్టి విక్రమార్క కూడా ఫోన్ చేయాలంటే ఆలోచిస్తున్నారా?
ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలకు తెలంగాణ ముఖ్యనేతల దగ్గర సమాధానం లేదంటున్నారు. అందుకే ఆయన జూబ్లీహిల్స్ ప్రచారానికి దూరంగా ఉంటున్నా.. ఎవరూ ఏమీ అడగలేకపోతున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పూర్తిగా మానిటర్ చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేయాలంటే కూడా ఆలోచిస్తున్నారట. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించి ఎన్నికల ప్రచార రంగంలోకి దింపుతారా? లేక లైట్ తీసుకొని వదిలేస్తారా అనేది చూడాలి.
Also Read: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి చంద్రబాబు, పవన్? వారి ఓట్లన్నీ బీజేపీకే పడతాయా?
