పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టని బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం..! కారణం అదేనా?

ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు.

పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టని బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం..! కారణం అదేనా?

Updated On : September 22, 2024 / 12:56 AM IST

Gossip Garage : బీఆర్‌ఎస్‌ బలోపేతంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం మీనమేషాలు లెక్కిస్తోందా? ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జుల నియామకంపై ఆసక్తి చూపకపోడానికి కారణమేంటి? ఇన్‌చార్జి పదవులు కావాలని స్థానిక నాయకత్వం పార్టీ వెంటపడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు.. సమర్థులు లేరనే భావనా… ఇంకా టైం ఉందన్న ఆలోచనా… ఇన్‌చార్జులు లేక.. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక దిగువస్థాయిలో క్యాడర్‌ కకావిలకమవుతున్నా, అధిష్టానంలో చలనం ఉండటం లేదన్న ప్రచారంలో నిజమెంత?

ఇన్‌చార్జుల నియామకంపై నిర్లక్ష్యం?
కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో పార్టీ ఇన్‌చార్జుల నియామకంపై బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం వహిస్తోందనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికార పార్టీ ఆకర్షణతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసింది. వీరిలో కొందరు పార్లమెంట్‌ ఎన్నికలకు మందే పార్టీ వీడగా, మరికొందరు లోక్‌సభ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. అయితే మొత్తం పది మంది పార్టీ మారితే బీఆర్‌ఎస్‌ మాత్రం కేవలం ఒక్కచోట మాత్రమే ఇన్‌చార్జిని నియమించి మిగిలిన తొమ్మిది చోట్ల ఎవరికీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పించకపోవడంతో క్యాడర్‌ గందరగోళానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. ఇన్‌చార్జుల నియామకంపై అధినాయకత్వం దృష్టి సారించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఇన్ చార్జులు లేక కార్యకర్తల ఇబ్బందులు..
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. వారి స్థానంలో ఇన్‌చార్జుల నియామకంపై ఎందుకు జాప్యం జరుగుతోందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాజీ మంత్రి రాజయ్యకు ఇన్‌చార్జిగా నియమించిన బీఆర్‌ఎస్‌… ఎమ్మెల్యేలు వలస వెళ్లిన భద్రాచలం, చేవెళ్ల, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, పటాన్‌చెరు, బాన్సువాడ, జగిత్యాల, గద్వాల నియోజకవర్గాలను మాత్రం వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గ బాధ్యతల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నా, అధిష్టానం మాత్రం ఎవరినీ పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

మన్నె గోవర్ధన్, దాసోజు మధ్య పోటీ..
పార్టీ పట్టించుకోకపోవడం, అధికార పార్టీ నుంచి ఒత్తిడి పెరగడం, బీజేపీ కూడా ఆకర్షిస్తుండటంతో ఇన్‌చార్జులు లేని నియోజకవర్గాల్లో క్యాడర్‌ చెల్లాచెదురవుతున్నట్లు చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి… సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే.. నాగేందర్‌ బీఆర్ఎస్‌ను వీడి దాదాపు ఆర్నెల్లు అవుతున్నా, ఇంతవరకు ఆ నియోజకవర్గంలో ఇన్‌చార్జిని నియమించలేదు. ఖైరతాబాద్‌ ఇన్‌చార్జి పోస్టును సీనియర్‌ నేత మన్నే గోవర్ధన్ ఆశిస్తున్నారు. ఆయనకు పోటీగా మరో సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్ కూడా రంగంలోకి దిగడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందంటున్నారు. ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు.

ఇన్‌చార్జి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయమై తర్జనభర్జన..
నగరంలోని కీలక నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కండువా మార్చేశారు. ఆయన స్థానంలో కార్తీక్ రెడ్డిని ఇన్‌చార్జ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. కానీ, అధిష్టానం ఆ నియోజకవర్గంపై ఎలాంటి ఫోకస్‌ చేయలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో చేవెళ్లలోనూ సరైన నేత కోసం అన్వేషణ కొనసాగుతోందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇన్‌చార్జి పదవి కోసం చటారి దశరథ్, దేశమల్ల ఆంజనేయుల, నారాయణ పోటీ పడుతున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఎవరికి ఇన్‌చార్జి ఇవ్వాలనే విషయంపై కనీసం దృష్టి పెట్టలేదంటున్నారు. ఇదే సమయంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు జగదీశ్వర్ గౌడ్, నాగేందర్ యాదవ్ బీఆర్‌ఎస్‌ను వీడారు. దీంతో ఆ నియోజవర్గంలో ఎవరికి ఇన్‌చార్జి ఇవ్వాలనే విషయమై బీఆర్‌ఎస్‌ తర్జనభర్జన పడుతోందని చెబుతున్నారు.

ఆ నియోజవర్గంలో ఇన్‌చార్జి నియామకం బీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్షే..
ఇదే విధంగా గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ వీడగా, ఈ నియోజవర్గంలోనూ ఇన్‌చార్జి నియామకం బీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష మారిందనే టాక్‌ వినిపిస్తోంది. గద్వాలలో ఎమ్మెల్యేతోపాటు జడ్పీ మాజీ చైర్మన్‌ సరిత తిరుపతయ్య కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబ సభ్యుడైన హనుమంతు నాయుడు పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానంలో ఇన్‌చార్జిగా తనను నియమించాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరుతుండగా, బీఆర్‌ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోసం వేచి చూస్తోందని చెబుతున్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డి కాగా, గత ఎన్నికల్లో బాన్సువాడ టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌. దీంతో ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట బీఆర్‌ఎస్‌.

Also Read : రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..

పెద్ద దిక్కు లేక క్యాడర్‌ చెల్లాచెదురవుతున్నట్లు సమాచారం..
అదేవిధంగా జగిత్యాలలోనూ ఇంతవరకు ఎవరికీ ఇన్‌చార్జి పదవి ఇవ్వలేదు. తాత్కాలికంగా ఎమ్మెల్సీ ఎల్‌.రమణ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నా, ఎమ్మెల్సీ కవిత సూచనలతో ఇక్కడ కొత్తవారిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఐతే ఈ ప్రయత్నాలు ఎప్పటికి కొలిక్కి వస్తాయో చెప్పలేమంటున్నారు. ఇలా బీఆర్‌ఎస్‌ను వీడిన పది మంది ఎమ్మెల్యేల స్తానంలో ఇన్‌చార్జులు లేక పార్టీలో గందరగోళం ఏర్పడిందనే టాక్‌ వినిపిస్తోంది. మరి బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎప్పుడు ఇన్‌చార్జి నియామకాలను పూర్తి చేస్తుందో చూడాల్సివుంది.