Grama Panchayat Election Results: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో కాంగ్రెస్ జోరు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
Grama Panchayat Election Results: తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. కొన్ని చోట్ల బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 3వేల 834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ మద్దతు తెలిపిన 2వేల 213 మంది సర్పంచ్ లు గెలిచారు. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 1127 మంది సర్పంచ్ లుగా గెలిచారు. ఇక బీజేపీతో మద్దతుతో 179 విజయం సాధించారు. ఇతరులు 504 గెలిచారు. 3,834 సర్పంచ్ పదవులకుగాను 12వేల 960 మంది అభ్యర్థులు.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65వేల 455 మంది పోటీ పడ్డారు.
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవన్న విషయం విదితమే. రాజకీయ పార్టీలు అభ్యర్థులను బలపరుస్తుంటాయి. వాటి ఆధారంగానే ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారనే దానిపై అంచనాకు రావొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14న నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయి.
తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. తొలి విడత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ అభ్యర్థులే గెలుపొందారని ఆయన తెలిపారు.
సీఎం రేవంత్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి చెందారని, అందుకే గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారని వెల్లడించారు. గ్రామ స్థాయి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉండటం, మైనారిటీలు, దళితులు, మహిళలు ఇలా అన్ని వర్గాల మద్దతు ఈ విజయానికి కారణం అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని, గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేస్తామని మహేశ్ గౌడ్ అన్నారు.
Also Read: ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ ఎందుకైంది? నెగటివిటీ, యాంటీ సెంటిమెంట్ రాకుండా ఇలా..
