HCA స్కామ్‌లో మరో బిగ్‌ట్విస్ట్.. ఈడీ దూకుడు.. బయటపడుతున్న అక్రమాలు.. వందల కోట్లు ఏమయ్యాయి..?
HCA అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బీసీసీ నుండి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్లు..

HCA Scam
Telangana HCA Scam : హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈసీఐఆర్ కింద మొత్తం ఐదుగురిపై పీఎంఎల్ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. బీసీసీఐ నిధుల విషయంలో మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి. కవితపై ఈడీ కేసులు నమోదయ్యాయి. వీరందరిని ఈడీ కస్టడికి కోరనుంది. సీఐడీ కస్టడీ ముగియగానే ఈడీ విచారణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
HCA అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బీసీసీ నుండి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేడియం టెండర్ల నుండి మొదలుకుని టికెట్ల విక్రయందాకా అన్నిట్లో గోల్‌మాల్ జరిగిందని విమర్శలున్నాయి. గత 10ఏళ్లలో బీసీసీఐ నుండి హెచ్‌సీఏకు 800కోట్లకుపైగా నిధులొచ్చాయి. కోట్ల రూపాయలు ఉన్న హెచ్‌సీఏ అకౌంట్‌నుసైతం సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు ఉన్నాయి.
2022లో జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావ్ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాల టెండర్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై గతంలోనే హెచ్‌సీఏ సభ్యులను ఈడీ విచారించింది. అయితే, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుసైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా జగన్ వ్యవహరించారని, ఫుడ్ క్యాటరింగ్, స్టేడియంలో స్టాల్స్, టికెట్ల కేటాయింపులోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్లు విమర్శలున్నాయి. వీటన్నింటిపై ఈడీ విచారణ చేయనుంది.
గతంలో నమోదైన ఈసీఐఆర్‌కి తాజా వివరాలను జోడించిన ఈడీ.. గత ఈసీఐఆర్ ఆధారంగా తాజా వివరాలతో విచారణ జరపనుంది. ఈసీఐఆర్‌లో ఐదుగురిపై కేసులు నమోదు చేసింది. గతంలో నమోదైన రెండు హెచ్‌సీఏ
కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ కేసులు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తుంది. ఇందులో భాగంగానే.. జగన్‌మోహన్‌రావు, శ్రీనివాసరావు, రాజేంద్రయాదవ్, సునీల్ కాంటే, జి.కవితపై కేసులు నమోదు చేసిన ఈడీ.. వారిని కస్టడీకి కోరనుంది. సీఐడీ కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.