Telangana : తెలంగాణలో ఈ నెల 7వ తేదీ వరకు భారీ వర్షాలు
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rain
Heavy rains in Telangana : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 5, 6, 7 తేదీలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. 4వ తేదీ శనివారం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్యలో ఉపరిత ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర దక్షిణ కోసాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల మధ్య కేంద్రీకృతమై దక్షిణానికి వంగి ఉందని తెలిపింది.
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6 నుంచి 12 తేదీల మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 4, 5, 6, 7 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ మేరకు 4వ తేదీ శనివారం జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
అలాగే అదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికను జారీ చేసింది.
ఈ నెల 5వ తేదీన అన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. 6వ తేదీన జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు, 7వ తేదీన అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరికను జారీ చేసింది.
24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 13 సెంటిమీటర్లు, నల్లగొండ జిల్లా చండూర్ 11, సిద్దిపేట జిల్లా వర్గల్ 10, నల్లగొండ జిల్లా మర్రిగూడ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట 8, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారం 7 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది.