High Court Angry : తెలంగాణలో లాక్ డౌన్ లేదనడంపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్ విధిస్తారో...నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High Court Angry Over Non Lockdown In Telangana
High court angry over non-lockdown : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్ విధిస్తారో…నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్ దిశగా ఆలోచన చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రెస్‌మీట్ పెట్టి మరీ…..ఆ అవసరం లేదని చెప్పడంపై హైకోర్ట్ సీరియస్ అయింది.
రంజాన్ పండుగ ముగిశాక లాక్‌డౌన్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఏజీ…మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ఉందని కోర్టుకు తెలిపారు. నైట్ కర్ఫ్యూ పొడిగింపుపైనా, లాక్‌డౌన్‌పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు.
హైదరాబాద్, రంగారెడ్డిలో కేసులు తగ్గాయని చెప్పడంపైనా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెబుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో ఎందుకు ఆపివేస్తున్నారని, అలా ఆపాలని ఎవరైనా ఆదేశాలెవరిచ్చారా అని హైకోర్టు నిలదీసింది.
ఇతర రాష్ట్రాల నుంచి అంబులెన్స్‌ల్లో వస్తున్నవారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని ఏజీ కోర్టుకు చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతోంటే..ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు చనిపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఆక్సిజన్ సరఫరా ఎందుకు నిలిచిపోయిందని, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ కావాలో, కేంద్రం ఎంత కేటాయిస్తోందో…పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను మధ్యాహ్నం రెండున్నరగంటలకు వాయిదా వేసింది.