నగరంలో కరోనా (covid 19) భయం : బాధిత యువకుడు 85 మందిని కలిశాడా

రాజధానిలో కరోనా ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలే భయపెడ్తుంటే… వైరస్ బారినపడ్డ బాధితుడు మరో 85 మందిని కలిశాడన్న ప్రచారం మరింత వణికిస్తోంది. వారందరికీ వైరస్ సోకిందా? అదే జరిగితే.. ఆ 85 మంది నుంచి ఇంకెంతమందికి అంటుకుంది? వీరందరూ ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం సాధ్యమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు… చిక్కుముడిగా మిగిలిపోయాయి. మన దగ్గర కరోనా వ్యాప్తిచెందే అవకాశమే లేదని ప్రభుత్వం చెప్తున్నా… కళ్ల ముందు జరుగుతున్న పరిణామాలు మాత్రం జనానికి ఊపిరి సలపనివ్వట్లేదు.
కరోనా బాధిత యువకుడు… గత రెండు వారాల్లో ఎవరెవర్ని కలిశాడన్నదే ఇప్పుడు అతి కీలకమైన అంశంగా మారింది. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధానంగా ఈ అంశంపైనే ఎక్కువసేపు చర్చించారు. వైరస్ నిర్ధారిత యువకుడు దుబాయి నుంచి వచ్చిన తర్వాత రెండ్రోజుల పాటు బెంగళూరులో ఉద్యోగానికి వెళ్లాడు. అక్కడ ఎవరెవర్ని కలిశాడు? సన్నిహితంగా మెలగిన సహచరులెవరు? వీరిలో తెలంగాణకు చెందిన వారెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాల్లేవు.
అయితే కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు… బాధిత యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బస్సులో 27 మంది ప్రయాణికులున్నట్లుగా గుర్తించారు. ఇప్పుడా 27 మందిని గుర్తించిన వైద్య యంత్రాంగం వారందరికీ గాంధీలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. బాధితుడి కుటుంబ సభ్యులు, మిత్రులు మరో 11 మంది ఉన్నారు. వీరిని అత్యవసరంగా గాంధీకి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధిత యువకుడికి… సికింద్రాబాద్ అపోలోలో చికిత్స చేసిన వైద్య బృందంలోనూ 42 మందిని అనుమానితులుగా గుర్తించారు.
హైదరాబాద్‌లో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదుకావడంతో అటు ప్రభుత్వం.. ఇటు వైద్యారోగ్య శాఖ అధికారులు పరుగులు పెడుతున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌కు ఇవ్వాల్సిన చికిత్సపై అధ్యయనం చేసేందుకు 15 మంది డాక్టర్లు, జిల్లా వైద్యాధికారుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నామని చెప్పారు. వైరస్ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి 50 వేలు మాస్కులు పంపించాలని కేంద్రాన్ని కోరామన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు వందకోట్లు కేటాయించింది. గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది. అంతేకాదు.. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read More : పెరుగుతున్న కరోనా కేసులు : భయం వద్దన్న మోడీ