Bigg Boss : పల్లవి ప్రశాంత్ కేసు.. బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు

ఈ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి.

Bigg Boss : పల్లవి ప్రశాంత్ కేసు.. బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు

Police Issues Notices To Bigg Boss Organisers

Updated On : December 25, 2023 / 11:46 PM IST

పల్లవి ప్రశాంత్ కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆకతాయిల పని పడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఏకంగా బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసుల్లో తెలిపారు. ఫైనల్స్ తర్వాత జరిగిన గొడవలు, బస్సులపై దాడులు, ఇతర ఘటనలపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించి ఇప్పటికే విన్నర్ ప్రశాంత్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి.

Also Read : జైలు నుంచి రిలీజైన పల్లవి ప్రశాంత్‌తో శివాజీ వీడియో.. ఏం మాట్లాడారో తెలుసా..?

ప్రశాంత్ సహా పలువురు అరెస్ట్ అవగా.. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో వారంతా విడుదలయ్యారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ విధ్వంసంలో ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అసలు ఈ గొడవలకు కారణం ఏంటి? అనేది తెలపాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు పంపారు.

బిగ్ బాస్ యాంకర్ నాగార్జునపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. ప్రముఖ లాయర్ హెచ్ ఆర్ సీలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫైనల్స్ ముగిసిన తర్వాత జరిగిన దాడులు, ఇతర ఘటనలను ఆయన హెచ్ ఆర్ సీ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ‘జమాల్ కుడు’ పాట.. ఈ పాటకు అర్ధం తెలుసా?

బిగ్ బాస్ 7 ఫైనల్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 24మందికిపైగా అరెస్ట్ చేశారు. మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వీడియో, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అవకుండా పోలీసులు కఠిన చర్యలకు పూనుకున్నారు. ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.