Hydra : నగరంలో మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు.. నల్లచెరువులోని ఆక్రమణలపై కొరడా
నగరంలో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టింది

Hydra Demolishing (Photo Credit : Google)
Hydra Demolitions in Kukatpally : నగరంలో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. కొద్దిరోజులగా కూల్చివేతలకు దూరంగా ఉన్న హైడ్రా బృందం.. ఆదివారం మళ్లీ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేసినవారి గుండెల్లో దడ మొదలైంది. ఉదయాన్నే కూకట్ పల్లిలోని నల్ల చెరువు ప్రాంతానికి చేరుకున్న హైడ్రా బృందం.. చెరువు భూమిని ఆక్రమించి చేపట్టిన అక్రమణ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి మోహరించారు.
Also Read : Nandamuri Mohana Krishna : చంద్రబాబుకు భారీ విరాళం అందించిన బాలకృష్ణ సోదరుడు.. వరదల బాధితుల సాయం కోసం..
కూకట్ పల్లిలోని నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 16షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. అయితే, ప్రజలు నివాసం ఉండే నిర్మాణాలపై త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తరువాత చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అపార్ట్ మెంట్లు, ఇళ్లపై హైడ్రా కొరడా ఝుళిపించే అవకాశం ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. జిల్లా పరిధిలోని అమీన్ పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేట్ పరిధిలోని సర్వే నెం. 164లో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.
రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశంలో హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు చట్ట బద్దతతో సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో హైడ్రా మరింత దుకుడు పెంచింది.