Uttam Kumar Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటా- ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటా- ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Uttam Kumar Reddy Senstional Comments

Updated On : October 24, 2023 / 8:10 PM IST

Uttam Kumar Reddy Senstional Comments : తెలంగాణలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్, బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని కాంగ్రెస్ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని విశ్వాసంగా ఉన్నారు. ఈ క్రమంలో హైఓల్టేజ్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్.. 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో BRS మండల అధ్యక్షుడు, ఇతర BRS కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

Also Read : వాళ్లు గెలవగానే వీళ్లను, వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకి పంపిస్తారు- మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇస్తున్నా. పాతవారు, కొత్త వారు అందరూ పార్టీలో సమన్వయంతో పని చేయాలని కోరుతున్నా. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. హుజూర్ నగర్ లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా.

ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయం. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి చెల్లించ లేదు. ఒక్క ఇల్లు కూడా పేదవానికి కట్టించ లేదు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మాత్రం 300 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారు. 30ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు.

Also Read : టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?

పోలీసులను అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కేటీఆర్, కవిత.. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరికాదు. మీది ఆ స్థాయి కాదు. రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత గాంధీ కుటుంబానిది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీ ఉత్తమన్న మంచి పదవిలో కొనసాగుతాడు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.