కవిత లేఖను లీక్ చేసింది ఎవరు..? బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ
కవిత రాసినట్లుగా పేర్కొంటున్న లేఖలో కేసీఆర్ కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాక.. ఈ లేఖలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు.

MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ సంచలనంగా మారింది. గత నెల 27న హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరిగింది. ఈ సభలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. అయితే, ఈ సభ తరువాత పార్టీ అధినేతకు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరు పేజీల లేఖను రాసినట్లుగా ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. ఈ లేఖపై బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యాలయం, కవిత కార్యాలయ వర్గాలు గానీ స్పందించలేదు. దీంతో ఈ లేఖపై బీఆర్ఎస్ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
కవిత రాసినట్లుగా పేర్కొంటున్న లేఖలో కేసీఆర్ కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాక.. ఈ లేఖలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు. ప్రధానంగా ఆవిర్భావ సభలో బీజేపీ గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారిసింది. అయితే, అసలు ఈ లేఖను కవితనే రాశారా..? ఎప్పుడు రాశారు..? ఇప్పుడు ఎవరు.. ఎందుకు లీక్ చేశారు..? ఇదంతా అధికార పార్టీ కుట్రలో భాగమా..? అనే అంశాలపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. గురువారం సాయంత్రం ఈ లేఖపై ప్రముఖ మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఇంత రచ్చ జరుగుతున్నా బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ స్పందించక పోవటంతో కవితనే ఈ లేఖను రాసి ఉంటారని తమ వర్గీయుల వద్ద పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నట్లు తెలిసింది.
మరోవైపు కవిత కొద్దికాలంగా బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్న వేళ ఆ నిర్ణయాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కవిత బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని, వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికి రాష్ట్ర పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోవటంతో ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేసీఆర్ కు ఈ లేఖను రాశారన్న వాదన ఉంది.
ఎందుకంటే.. ‘‘రజతోత్సవ సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్ ఛార్జులకు ఇవ్వడంతో వాళ్లు పాత పద్దతిలో.. తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్ బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. మళ్లీ పాత ఇన్ ఛార్జులకే.. స్థానిక సంస్థల ఎన్నికల బీ-ఫాంల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్ ఛార్జులు చెప్పుకుంటున్నారని తెలిసింది. ఇన్ ఛార్జుల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీ-ఫాంలు ఇవ్వాలని కోరుతున్నా’’ అంటూ లేఖలో ప్రస్తావించడాన్ని పలువురు బీఆర్ఎస్ నేతలు తమ వర్గీయుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం.
లిక్కర్ పాలసీ కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చారు. అయితే, కవిత బెయిల్‌పై జైలు నుంచి బయటకు రావడానికి బీజేపీ పెద్దలతో కేసీఆర్ రాయబారం నడిపినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. కుమార్తెను లిక్కర్ కేసు నుంచి బయటపడేసేందుకు బీజేపీతో కేసీఆర్ పొత్తుకు రెడీ అయ్యారన్న ప్రచారమూ జరిగింది. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు పలుసార్లు తీవ్రంగా ఖండించారు. కానీ, అంతర్గతంగా బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాల మధ్య రాబోయే కాలంలో పొత్తు విషయంపై చర్చలు జరుగుతున్నాయన్న వాదన ఉంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్న కవిత ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ పై ఫీడ్ బ్యాక్ అంటూ లేఖను రాశారని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. మొత్తానికి కవిత పేరుతో బయటకు వచ్చిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది.