IT Raids On Ponguleti house: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.

IT Raids On Ponguleti house: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

Ponguleti Srinivas Reddy

Updated On : November 9, 2023 / 8:11 AM IST

Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ శాఖల అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం తెల్లవారు జాము 3గంటలకు ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఖమ్మంలోని ఇల్లు, పాలేరు క్యాంపు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. జూబ్లిహిల్స్ లోని నందగిరి హిల్స్ వద్ద నివాసంలోనూ మూకుమ్మడిగా అధికారులు ప్రవేశించి నివాసంలో ఉన్నవారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం గమనార్హం.

Also Read : Assembly Elections 2023: కాంగ్రెస్, బీజేపీల విజయానికి ఆ సీట్లు ఎందుకు అంత కీలకం?

తనపై ఐటీ దాడులు జరుగుతాయని ఇప్పటికే పొంగులేటి వ్యాఖ్యానించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని చెప్పారు. పొంగులేటి వ్యాఖ్యానించిన మరుసటిరోజే ఐటీ శాఖ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. కొంతకాలం క్రితం వరకు అధికార పార్టీ బీఆర్ఎస్ లో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అధినేతతో విబేధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ను వీడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- చైర్మన్ గా ఉన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Also Read : Kinjarapu Atchannaidu : కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ..! అచ్చెన్నాయుడు సీరియస్

మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం ఈసీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీ సిటీలో ఉన్న తుమ్మల నివాసంలో ఈసీకి సంబంధించిన ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై వరుసగా అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.