జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్త హత్యపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

నేను పోలీసులతో వ్యక్తిగతంగా మాట్లాడాను. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పాను.

జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్త హత్యపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

Updated On : October 22, 2024 / 10:59 PM IST

Jagtial Ganga Reddy Incident : జగిత్యాలలో సంచలనం రేపిన కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. గంగారెడ్డి హత్యను రాజకీయ కోణంలో చూడటం బాధాకరం అన్నారాయన. జగిత్యాల అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నాని, హత్యా రాజకీయాలను కాదని ఆయన స్పష్టం చేశారు. గంగారెడ్డిని హత్య చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు.

”గంగారెడ్డి హత్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ హత్యకు కారణమైన నిందితులు ఎవరైనా.. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని నేను పోలీసులతో మాట్లాడాను. ఆ హత్య వెనుక ఇంకా ఎవరైనా పరోక్షంగా ఉన్నా.. వారిని కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీని ఆదేశించడం, కోరడం జరిగింది. ఈ హత్యకు కారణాలు తెలుసుకోవాలి.

దీన్ని రాజకీయ కోణంలో చూడటం అన్నది బాధాకరమైన విషయం. గంగారెడ్డి హత్యకు గురి కావడం బాధాకరం. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప హత్యా రాజకీయాలను కాదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నేను పోలీసులతో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఈ హత్య వెనుక ఎవరున్నా ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించొద్దని చెప్పాను” అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో కాంగ్రెస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జగిత్యాల భగ్గుమంది. దీనిపై జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ్ముడు లాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. గంగారెడ్డి హత్యకు నిరసనగా జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే గంగారెడ్డిని హత్య చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు మరోసారి పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అనైతిక పార్టీ ఫిరాయింపుల వల్లే నేను గంగారెడ్డి హత్యకు గురయ్యాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు జీవన్ రెడ్డి.

Also Read : 4 నెలల నుంచి మానసికంగా అవమానాలకు గురవుతూ వచ్చాం: జీవన్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌