జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన…60 డివిజన్లలో అభ్యర్థులు పోటీ

Janasena contest GHMC elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోయినా… అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేస్తోందీ. 60 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతోంది. నామినేషన్‌లకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్ధులపై జనసేన కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని జనసేన నేతలు చెబుతున్నారు. పొత్తుపై బీజీపీ నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదన రాలేదంటున్నారు. ఇవాళో, రేపో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం (నవంబర్ 17, 2020) ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు కార్యకర్తల నుంచి వినతులు వచ్చాయని.. వారి కోరికను మన్నించి పోటీ చేయాలని నిర్ణయించామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పలు డివిజన్లలో జనసేన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని చెప్పారు.
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదు. కాగా, దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్.. బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన ప్రకటించడం.. బీజేపీ అభిమానుల్లో టెన్షన్‌కు కారణమైంది.
https://10tv.in/kcr-focus-on-ghmc-elections-trslp-meeting-today/
హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు, ముఖ్యంగా కాపులు జనసేనకు ఓటేసే అవకాశం ఉందనే భావన వ్యక్తం అవుతోంది. జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా.. కొన్ని స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న చోట్లు బీజేపీ డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతుందనే ప్రచారమూ సాగుతోంది.
పైకి పొత్తు లేకున్నా.. ఒకరికొకరు సహకరించుకునే రీతిలో ఇరు పార్టీలు లోపాయికారిగా అవగాహనకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్, టీడీపీ, జనసేన మధ్య చీలిపోయి బీజేపీకి లబ్ధి చేకూరుతుందనే వాదన ఉంది.