Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. నవీన్ యాదవ్ కే టికెట్..
ఇన్ని రోజులు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అవకాశం మాత్రం నవీన్ ను వరించింది.

Naveen Yadav: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయంలో ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ తన ఎమ్మెల్యే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరుని ఏఐసీసీ ఫైనల్ చేసింది. ఇన్ని రోజులు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అవకాశం మాత్రం నవీన్ ను వరించింది.
ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని అనౌన్స్ చేసేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అంతేకాదు ప్రచార పర్వంలోనూ దూసుకుపోతోంది. టీడీపీ, ఎంఐఎంలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏడు రాష్ట్రాల్లో 8 స్థానాలకుగాను ఉపఎన్నికలను ఖరారు చేసినప్పటి నుంచి అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ తీవ్రమైన పోటీ నడిచింది. పలువురు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. తమకే టికెట్ దక్కుతుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా ఉన్న వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలో స్థానికుడైన నవీన్ యాదవ్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసింది. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘంగా పని చేశారు. పైగా స్థానికుడు కావడంతో ఆయనకే టికెట్ దక్కింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరుని ఏఐసీసీ ప్రకటించడంపై నవీన్ యాదవ్ స్పందించారు. ప్రజా సేవ చేసుకునేందుకు తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కి కృతజ్ఞతలు తెలిపారు నవీన్ యాదవ్. యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో తనకీ ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. ప్రజా ఆదరణ తనకున్న బలం అన్నారాయన. 40 ఏళ్లుగా తన కుటుంబం ప్రజా సేవలో ఉందని గుర్తు చేశారు. పవర్ లో లేనప్పుడు కూడా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సింపతీ పేరు మీద కాకుండా చేసిన అభివృద్దిపై బీఆర్ఎస్ వాళ్లు ఓట్లు అడగాలని నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు.