రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మరోసారి హరీశ్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు.

Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరైన విషయం తెలిసిందే. విచారణ తరువాత నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కు వెళ్లిన ఆయన.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణ నిమిత్తం రేపు (బుధవారం) కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. విచారణ సందర్భంగా కమిషన్‌కు అందించాల్సిన డాక్యుమెంట్స్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక.. కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై చర్చించేందుకు హరీశ్ రావు కేసీఆర్ తో మరోసారి భేటీ అయినట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ముఖ్యనాయకులతో ఇవాళ భేటీ అవ్వనున్నారు. కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లేసమయంలో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చినట్లు సమాచారం.