20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. అయినప్పటికీ.. వాళ్లు చేసింది ఓ కుట్రనా? కాదా?: కవిత

నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జనంబాట ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. అయినప్పటికీ.. వాళ్లు చేసింది ఓ కుట్రనా? కాదా?: కవిత

Updated On : October 25, 2025 / 6:39 PM IST

Kalvakuntla Kavitha: ఇంటి గుట్టు బయట పెట్టి కుట్ర చేసి తనను బీఆర్‌ఎస్‌ నుంచి బయటకి పంపించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జనంబాట ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

“నిజామాబాద్ లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా? నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. 20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా. ఇంటి గుట్టు బయట పెట్టి… కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా.

ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా. 5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయాను. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది.

నేను నిజామాబాద్ కోడలిని. ఇది నా గడ్డ. ఎప్పటికైనా ఈ గడ్డలోనే కలిసిపోతా. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే నా మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుంది.

Also Read: అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇకపై నెలవారీ, వార్షిక పాస్‌ సమాచారం.. అంతేకాదు.. రూ.3,000కే..

ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ ఈ జిల్లాలోని కందకూరులో పుట్టారు. ఇంకో పక్క మనాల అడవుల్లో ఎన్ కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఉంది.

ఆర్ఎస్‌యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరికీ మద్దతు ఇచ్చిన చరిత్ర మన జిల్లాది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి సారి నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ గెలిచారు. అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుంది.

అన్ని భావజాలాలకు మద్దతునిస్తూ ముందున్నటువంటి జిల్లా మనది. మీ బిడ్డను కాబట్టి నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ కు పంపించారు. మీ మర్యాద, గౌరవం కాపాడే విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను.

బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి అన్ని సీట్లు గెలిపించారు. నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చా. గత 20 ఏళ్లుగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.

మీ కోడలిగా, బిడ్డగా నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురుచూశా. నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే. కానీ నన్ను కుట్ర చేసిన పంపించారు.

నిజామాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరుతున్నా. నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా కాదా ఆలోచించాలని అడుగుతున్నా. ఇక్కడ ఏం కుట్ర జరిగిందో చిన్న పిల్లలను అడిగిన సరే చెబుతారు.

ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న గారు, బీఆర్ఎస్ మీద ప్రేమతో భరించా. కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించారు.

ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా. తొలి అడుగు మన గడ్డ మీది నుంచే అని వచ్చాను. మన అక్కాచెల్లెళ్లు ప్రతి విషయంలో కష్టపడుతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయదు. ఈ ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ ఇస్తలేదు. పెన్షన్ కోసం ప్రభుత్వం పై పిడికిలి బిగించి కొట్లాడాలె.

ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోంది. గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు.

ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది. ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం.

ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు రావాలె. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా పెన్షన్ రావాలి. ఇంకా అనేక అంశాలు, విషయాలు ఉన్నాయి. వాటిపై పోరాటం చేయాల్సి ఉంది.

జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతాను. ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేస్తాను. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా.

ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు…ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలి.పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉంది.

నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇక గురుకులాల్లో ఆత్మహత్యలు, అత్యాచారాలు ఎలుకలు విద్యార్థులను కొరకటం వంటివి జరుగుతున్నాయి.

ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలె. కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతున్నారు. ఈ జిల్లాకే చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌ గౌడ్ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదు.

సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేకపోతున్నారు. బంగారు లేడినో, ఆకాశంలో పక్షినే మనం అడగటం లేదు. మనకు మంచి తిండి కావాలని అడుగుతున్నాం. బీఆర్ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. ఇన్నాళ్లు కేసీఆర్ గారి నీడలో ఉన్నా. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని నమ్ముతున్నా” అని అన్నారు.