వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యం సహకరిస్తే పోటీ చేస్తా.. లేదంటే..: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

"కొడంగల్‌కు ఎన్ని నిధులు ఇస్తే నాకు కూడా అన్ని నిధులు కావాలని సీఎంకు చెప్పాను" అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యం సహకరిస్తే పోటీ చేస్తా.. లేదంటే..: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy (Image Credit To Original Source)

Updated On : January 27, 2026 / 3:12 PM IST
  • బొట్టుగూడలో పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి కామెంట్స్‌
  • నియోజకవర్గ అభివృద్ధిని చేసుకుంటూ కాలం గడిపేస్తా
  • నా నియోజక వర్గానికి నిధులు కావాలని సీఎంకు చెప్పా
  • పేదలను కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నాయి

Komatireddy Venkat Reddy: ప్రపంచస్థాయి ప్రమాణాలతో నల్లగొండ నగరంలోని బొట్టుగూడలో పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పాఠశాలలో వాల్డార్ఫ్‌ విద్యా విధానంతో 600 మంది విద్యార్థులకు విద్యను బోధిస్తారు. ఇందులోని 36 తరగతి గదులకు సెంట్రల్‌ ఏసీలను అమర్చారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై కూడా స్పందించడం గమనార్హం. “వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యం సహకరిస్తే పోటీ చేస్తా.. లేదంటే నియోజకవర్గ అభివృద్ధిని చేసుకుంటూ కాలం గడిపేస్తా. కొడంగల్‌కు ఎన్ని నిధులు ఇస్తే నాకు కూడా అన్ని నిధులు కావాలని సీఎంకు చెప్పాను.

Also Read: భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఇకపై మనకు ఏ లాభాలు దక్కుతాయంటే?

పేదలను కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నాయి. నేను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూల్స్‌ను రద్దు చేస్తా. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనే కాకుండా, కార్పొరేట్ వసతులు కల్పించాలనే ఉద్దేశంతో బొట్టుగూడలో ఈ పాఠశాలను నిర్మించాను. ర్యాంకులు, మార్కులే కాకుండా శాస్త్రీయ విధానంలో, సృజనాత్మకంగా తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం.

వాల్డార్ఫ్‌ విద్యా విధానం స్ఫూర్తితో ఈ పాఠశాల లో విద్యను అందిస్తాం. దేశానికే ఆదర్శంగా కోమటిరెడ్డి ప్రతీక్ పాఠశాలలో విద్యను అందిస్తాం. ఈ స్కూల్‌లో పని చేసే ఉపాధ్యాయులు అందరూ తమ పిల్లలను ఇదే పాఠశాలలో చేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉంది.

నల్లగొండ నియోజకవర్గం నాకు గుండెకాయ లాంటిది. నేను ఏది అడిగినా సీఎం రేవంత్ రెడ్డి కాదనరు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎవరూ అడగకున్నా నల్లగొండను కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేయించా. ఎస్సెల్బీసీ సొరంగం పూర్తి చేయడమే నా లక్ష్యం” అని తెలిపారు.