KPHB లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా బిల్డింగ్ కూలే అవకాశం!

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 12:47 PM IST
KPHB లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా బిల్డింగ్ కూలే అవకాశం!

Updated On : November 15, 2020 / 12:56 PM IST

KPHB fire Accident : KPHB లో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో హార్డ్‌వేర్‌, శానిటరీ షాపులో మంటలు రేగాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి బిల్డింగ్ గోడలకు పగళ్లు ఏర్పడ్డాయి. రెండో అంతస్తులోని ఫ్లోర్ ఊగుతోంది. దీంతో ఏ క్షణానైనా బిల్డింగ్ కూలే అవకాశం ఉందని భావిస్తున్నారు. లోపలకు వెళ్లే ప్రయత్నాన్ని ఫైర్ సిబ్బంది విరమించుకున్నారు.



7 గంటలుగా :-
7గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. ఓ వైపు ప్లాస్టిక్, మరోవైపు పెయింట్స్‌ కావడంతో మంటలు తగ్గినట్లే తగ్గి మళ్లీ అంటుకుంటున్నాయి. బిల్డింగ్‌ ముందు భాగం నుంచి లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వెనక భాగంలో అధికారులు గోడలను బద్దలు కొట్టారు. అక్కడ్నుంచి లోపలకు వెళ్లినప్పటికీ దట్టమైన పొగ, ఊపిరి ఆడకపోవడంతో ఫైర్ సిబ్బంది వెనక్కు తగ్గారు. ఆరు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.



టెన్షన్ లో బంగారం దుకాణ యజమానులు  :-
అదనంగా కొన్ని వాటర్ ట్యాంకులను కూడా తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ సిబ్బందిని కూడా తరలిస్తున్నారు. ఎప్పుడు మంటలు చెలరేగుతాయోననే టెన్షన్‌లో మిగిలిన షాపు యజమానులు ఉన్నారు. ఈ బిల్డింగ్‌లో CMR జ్యుయలరీ షాపు కూడా ఉంది. వేడికి బంగారం ఏమైపోతుందోనని షాపు యాజమాన్యం టెన్షన్‌లో ఉంది. సిబ్బంది లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. పక్కనున్న షాపులను కూడా ఖాళీ చేయిస్తున్నారు.



ఫైర్ సేఫ్టీ లేదు :-
బిల్డింగ్‌ పైభాగంలో ఇరుక్కుపోయిన వాచ్‌మెన్‌తో పాటు మరో ముగ్గుర్ని కూడా ఫైర్‌ సిబ్బంది రక్షించారు. ఈ బిల్డింగ్‌లోపలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పక్క బిల్డింగ్‌పై నుంచి నిచ్చెనలు వేసి వారిని కాపాడారు. ఈ బిల్డింగ్‌కు ఫైర్‌ సేప్టీ లేదని తెలుస్తోంది. బిల్డింగ్‌కు సెట్‌బ్యాక్‌ వదలాల్సి ఉన్నప్పటికీ అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సాధారణంగా లోపల ఫైరింజన్ చుట్టూ తిరిగేందుకు వీలుగా నిర్మాణం ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అసలు నిబంధనలు పట్టించుకోలేదు.



మిగతా భవనాలు సురక్షితం :-
దీనికి తోడు ప్రతి కమర్షియల్ బిల్డింగ్‌కు అదనంగా బయటవైపు స్టెయిర్‌కేస్‌ ఉండాలి. కానీ ఈ బిల్డింగ్‌కు అవేమీ లేదు. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతోంది. ఫైర్‌ సిబ్బంది పక్క బిల్డింగ్‌ల మీద నుంచి ఈ బిల్డింగ్‌ మీదకు వెళ్లారు. మరోవైపు కేపీహెచ్‌బీ అగ్ని ప్రమాదంలో మంటలు వ్యాపించిన భవనం తప్ప… మిగిలినవన్నీ సురక్షితంగా ఉన్నాయని, బంగారం షాపులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పోలీసులు చెప్పారు. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చామని, చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీచేయించామని చెప్పారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు