KTR: గతంలో భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవి.. ఇప్పుడు మాత్రం..: కేటీఆర్
ఈసారి నాలాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వరద ప్రభావం కొంత తగ్గిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు వర్షాలపై రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ అన్నారు.

KTR
KTR – Rains In Telangana: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ (Hyderabad) నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అనంతరం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు.
ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం హైదరాబాద్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఇటువంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవని కేటీఆర్ చెప్పారు. ఈసారి నాలాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వరద ప్రభావం కొంత తగ్గిందని తెలిపారు. గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గిందని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలు వర్షాలపై రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా విమర్శలు చేయవద్దని చెప్పారు. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను తాము ఆదేశించామని చెప్పారు. అవసరమైతే తాను కూడా స్వయంగా వెళ్తానని తెలిపారు.
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. పురపాలక శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారని అన్నారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులనూ రద్దు చేశామని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణనష్టం జరగకుండా చూడడమేనని చెప్పారు. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. హైదరాబాద్ లో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేస్తామని అన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు, సిబ్బంది విస్తృతంగా పనిచేస్తున్నారని తెలిపారు.