Revanth Reddy : వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలి.. మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు.

Revanth Reddy Letter KTR
Revanth Reddy Letter KTR : మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ నగరం విలవిల లాడుతుందన్నారు. ప్రజల గోసను కేటీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫౌంహౌస్ లో కేసీఆర్, పార్టీలలో కేటీఆర్ సేద తీరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేశామని చెప్పుకోవడానికి తండ్రి, కొడుకులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు.
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పాడైన రోడ్లను యుద్ధ ప్రతిపాధికన మరమ్మతులు చేయాలని కోరారు. ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో రేపు (శుక్రవారం) కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.
జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీర వచ్చి చేరుతోంది.దీంతో ఈ రెండు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తి వేశారు. తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము 7 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.