High Court Stay: బీసీ రిజర్వేషన్లు.. హైకోర్టులో రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్..!
పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telangana High Court
High Court Stay: రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై కోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 9పై న్యాయస్థానం స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, రవివర్మ తమ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు నిబంధనలు, తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన జీవో.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని.. జీవో నెంబర్ 9పై స్టే విధించింది. జీవో నెంబర్ 9 ప్రకారమే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, నోటిఫికేషన్ మీద కూడా స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
50 శాతం మించి రిజర్వేషన్ల పెంపునకు సరైన కారణాలు ఉన్నాయని రవివర్మ వాదించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు న్యాయవాది రవివర్మ.
హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. కోర్టు స్టే ఆర్డర్ పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తామంది.
”ఏ జీవో నెంబర్ 9 ద్వారా అయితే ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందో దాన్ని చాలెంజ్ చేస్తూ పిటిషన్లు వేయడం జరిగింది. ఆ జీవోని కోర్టు స్టే చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను జీవో నెంబర్ 9 ఆధారంగా ఇచ్చారు. జీవో నెంబర్ 9పై కోర్టు స్టే విధించడంతో నోటిఫికేషన్ పైన కూడా స్టే విధించినట్లు అవుతుంది” అని న్యాయవాదులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఇచ్చిన జీవోను (42 శాతం రిజర్వేషన్లు) వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. జీవో నెంబర్ 9పై స్టే విధించింది. కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. నవీన్ యాదవ్ కే టికెట్..