KTR Biryani Masala : వీడెవడండి బాబూ.. బిర్యానీలో మసాలా రాలేదని కేటీఆర్‌కు ట్వీట్..
కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు శుక్రవారం(మే 28,2021) ఓ చిత్రమైన విజ్ఞప్తి వచ్చింది. బిర్యానీలో మసాలా రాలేదంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో కేటీఆర్ అవాక్కయ్యారు.

Ktr Biryani Masala
KTR Biryani Masala : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజూ ఎంతో మంది తమ సమస్యలపై కేటీఆర్ కు విజ్ఞప్తులు చేస్తుంటారు. సాయం కోరుతుంటారు. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించే కేటీఆర్.. తన కార్యాలయ సిబ్బంది ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. కాగా, కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు శుక్రవారం(మే 28,2021) ఓ చిత్రమైన విజ్ఞప్తి వచ్చింది. బిర్యానీలో మసాలా రాలేదంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో కేటీఆర్ అవాక్కయ్యారు.
తోటకూరి రఘుపతి అనే వ్యక్తి.. తాను జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశానని తెలిపాడు. ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కావాలని తాను ఆర్డర్ చేస్తే, అవేవీ లేకుండానే తనకు చికెన్ బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఆ వ్యక్తి వాపోయాడు. జొమాటో వాళ్లు ప్రజలకు ఇలాగేనా సేవ చేసేది? అంటూ ఆ వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.
దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. దీనికి నన్నెందుకు ట్యాగ్ చేయడం బ్రదర్? ఈ విషయంలో నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అని ప్రశ్నించారు. నెట్టింట ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు వ్యంగ్యంగా, హాస్యభరితంగా స్పందించారు.
అన్నింటికీ మించి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ట్వీట్ పట్ల స్పందించారు. తన కార్యాలయం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందని, కేటీఆర్ కూడా స్పందించాల్సిందేనని ఒవైసీ చమత్కరించారు.
And why am I tagged on this brother? What did you expect me to do ?? https://t.co/i7VrlLRtpV
— KTR (@KTRTRS) May 28, 2021