పెద్దపల్లి జిల్లా పోస్టాఫీస్‌లో ఘరానా మోసం.. ఏకంగా కోటి రూపాయలు మాయం..! అసలేం జరిగిందంటే..

ఇటీవల బదిలీపై వచ్చిన పోస్ట్ మాస్టర్ శివకుమార్.. అనుమానం వచ్చి పలు ఖాతాలను తనిఖీలు చేయగా.. ఘరానా మోసం వెలుగుచూసింది.

పెద్దపల్లి జిల్లా పోస్టాఫీస్‌లో ఘరానా మోసం.. ఏకంగా కోటి రూపాయలు మాయం..! అసలేం జరిగిందంటే..

Updated On : October 26, 2024 / 6:27 PM IST

Fraud In Post Office : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట పోస్టాఫీస్ లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఏకంగా కోటి రూపాయలు మాయం చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోస్టాఫీస్ ముందు ఆందోళనకు దిగారు.

ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పేరుతో పల్లెల్లో లావాదేవీలు జరుపుతోంది తపాలాశాఖ. బ్యాంకుల మాదిరిగా అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. ఈ వ్యవహారంపై పర్యవేక్షణ, జవాబుదారితనం లేక రామగిరి మండలం బేగంపేట పోస్టాఫీస్ లో ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు 400 మంది ఖాతాదారుల ఖాతాల నుంచి కోటి రూపాయల వరకు గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తోంది.

డిపాజిట్లు, ఆర్డీల నగదును.. నకిలీ పాస్ పుస్తకాలతో పక్కదారి పట్టించారు. బేగంపేట పోస్టాఫీస్ కు చెందిన హేమ అనే మహిళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పోస్టాఫీస్ లో ఖాతాలు తెరిచేందుకు వచ్చిన నిరక్ష్యరాసులను గుర్తించి వారికి నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టారు. వారి ఖాతాల్లో జమచేసిన నగదును తన సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన పోస్ట్ మాస్టర్ శివకుమార్.. అనుమానం వచ్చి పలు ఖాతాలను తనిఖీలు చేయగా.. ఘరానా మోసం వెలుగుచూసింది. కొంతమంది ఖాతాదారులను పిలిపించి వారి పాసు పుస్తకాలను పరిశీలించగా నకిలీవిగా తేలింది.

”బ్రాంచ్ పోస్టర్ హేమ నిజస్వరూపం, చేతివాటం బయటపడింది. అప్పటి ఎస్పీ నరేంద్ర చారి ఆదేశాల మేరకే నేను ఇలా చేశాను, ఈ అవినీతికి పాల్పడ్డాను అని హేమ ఫోన్ లైన్ లో చెప్పారు. డబ్బుల స్వాహా వెనుక నాతో పాటు ఆయన పాత్ర కూడా ఉందని చెప్పారామె. నావి 12 లక్షల రూపాయలు పోయాయి. నా డబ్బులు నాకు ఇప్పించండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అని నమ్మి డబ్బులు పెడితే ఇలా జరిగింది. తన ఖాతాలో 2 లక్షల రూపాయలు తక్కువ ఉన్నాయి. దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు స్కామ్ జరిగినట్లు తెలిసింది. తపాలా శాఖ అధికారులు, పోలీసులు మాకు న్యాయం చేయాలి. మా డబ్బు మాకు ఇప్పించాలి” అని బాధితులు వేడుకుంటున్నారు.

చేసిన మోసాన్ని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హేమ అంగీకరించారు. తన పైఅధికారి చెబితేనే తానిలా చేశానని అంటున్నారు. తనకు నెల రోజుల సమయం ఇస్తే ఖాతాదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటున్నారు హేమ. ఇందులో తన తప్పేమీ లేదన్నారు హేమ. అంతేకాదు ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారామె. నెల రోజుల సమయం ఇస్తే ఎవరి డబ్బులు వారికి ఇచ్చేస్తానని అన్నారు. దయచేసి నాకు నెల సమయం ఇవ్వండి, తెలియక చేసిన తప్పునకు క్షమించండి అని ఖాతాదారులను వేడుకున్నారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హేమ.

”బేగంపేట పోస్టాఫీస్ లో జరిగిన గోల్ మాల్ గురించి మాకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోస్టాఫీస్ కు వచ్చాం. ఖాతాదారులను వెరిఫై చేస్తున్నాం. ప్రాసెస్ జరుగుతోంది. మా దగ్గరున్న రికార్డులకు అనుగుణంగా ఖాతాదారులు అందరికీ న్యాయం చేస్తాం. ఖాతాదారులు కొంత సంయమనం పాటించాలి” అని తపాలా శాఖ అధికారి మోహన్ విజ్ఞప్తి చేశారు.

 

Also Read : ఫస్ట్‌ అరెస్ట్ ఆయనదేనా..? దివాలీలోపు తెలంగాణలో ఏం జరగబోతోంది?