Weather Updates : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ
Weather Updates : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert
Weather Updates : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములతోకూడిన వర్షాలు పడుతాయని, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. సోమవారం ఉదయం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. వచ్చే మూడు రోజులు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబ్ నగర్, కరీంనగర్, కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉరుములతో కూడిన వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అకాశంఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మరోవైపు.. రాబోయే మూడునాలుగు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల భారిన పడకుండా రక్షించుకోవచ్చని వారు సూచించారు.
