Telangana: మండే ఎండల్లో చల్లటి కబురు.. వచ్చే మూడు రోజులు ఆ జిల్లాల్లో వానలు..
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో..

Rain
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అయితే, బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని వార్త తీసుకొచ్చింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది.
Also Read: KA Paul : ఇంత కక్కుర్తి ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై కేఏ పాల్ ఫైర్
ఇదిలాఉంటే.. ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు.. వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో గురువారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మెదక్ లో 39.6 డిగ్రీల సెల్సియస్, అదిలాబాద్ లో 39.0 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ లో 38.6, భద్రాచలంలో 37.8, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో 37.6, నల్గొండలో 37.0, దుండిగల్, హకీంపేట్ లలో 36.3, హన్మకొండలో 34.5, హైదరాబాద్ లో 36.5, రామగుండంలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వచ్చే మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో వాతావరణం చల్లబడి ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.