Nizamabad Hospital Incident: నిజామాబాద్ ఘటనపై మంత్రి హరీష్‌రావు సీరియస్.. స్పందించిన షర్మిల, డీకే అరుణ .. దుష్ప్రచారమన్న సూపరింటెండెంట్
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈను ఆదేశించారు.

Minister Harish Rao
Nizamabad Hospital Incident: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వం ఆస్పత్రి ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. రోగిని కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈను మంత్రి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవటంతో రోగిని కాళ్లు పట్టుకొని లిఫ్టు వరకు రోగి బంధువులు లాకెళ్లారు. రోగిని కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నా కనీసం ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఏప్రిల్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ట్విటర్ వేదికగా షర్మిల ఆగ్రహం..
నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. దొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ అంటే? అంటూ ప్రశ్నించారు. రోగులను నేలపై లాక్కొని పోవడం కార్పొరేట్ వైద్యమా? స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా అని ప్రశ్నించారు. ఏటా 11వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. కనీసం రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుందంటూ షర్మిల విమర్శించారు. ఇది మీరు చెప్తున్న ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న “అనారోగ్య తెలంగాణ” అంటూ ట్విటర్ వేదికగా షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
దుష్ప్రచారం చేస్తున్నారు : సూపరింటెండెంట్
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ స్పందించారు. జిల్లా ఆసుపత్రి పై ప్రజలకు నమ్మకం పోగేట్టేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటనకు ప్రభుత్వ ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. పేషెంట్ కేర్ సిబ్బంది మార్చి 31న రోగిని వీల్ చైర్‌లో కూర్చోబెట్టారు. ఓపి చిట్టీ తీసుకుని వచ్చేలోపు లిఫ్ట్ వచ్చిందని తల్లిదండ్రులు ఆ రోగిని లాక్కెళ్లారు. 2వ అంతస్థు చేరుకున్న పేషెంట్‌ను వీల్ చైర్‌లో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. జరిగిన విషయం తెలియని వ్యక్తి ఆ వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ అన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : డీకే అరుణ
నిజామాబాద్ ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ ఘటనపై ట్విటర్ వేదికగా స్పందించారు. నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చిన రోగికి కనీసం స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో, రెండో అంతస్తు లిఫ్ట్ వరకు రోగి బంధువులే, రోగి కాళ్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్నా.. వైద్య సిబ్బంది చూస్తూ ఊరుకున్నారే కానీ.. కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న కనీస వసతుల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చునని డీకే అరుణ విమర్శించారు. రోజుకు 1500 మంది రోగులు వైద్య సహాయంకోసం ఆసుపత్రికి వస్తే కనీసం వారికి స్ట్రెచర్లు కూడా అందుబాటులో ఉంచకపోవడం తెలంగాణ రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ పనితీరుకు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వసతులు కల్పించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.