బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారు.. మేమే వద్దంటున్నాం: మంత్రి జూపల్లి
బీఆర్ఎస్ వీడడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. తామేమెరినీ ప్రోత్సహించడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Minister Jupally Krishna Rao
Jupally Krishna Rao: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పారు. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 2 అమలు చేశామని, మిగతా హామీలు కూడా అమలయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. హామీలు నేరవేర్చనందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు.
అదానీని ముఖ్యమంత్రి కలిస్తే తప్పేంటి?
శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ అప్పుల కుప్ప బయటపడిందని.. మంచి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని, పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారని జూపల్లి విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే పథకాలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. తమ హామీలతో పోటీపడి బీఆర్ఎస్ పథకాలు ప్రకటించింది కదా.. మరి వాటిని ఎలా అమలు చేసేవారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానీని ముఖ్యమంత్రి రేవంత్ కలిస్తే తప్పేంటని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మైత్రి ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు.
ఫ్రస్టేషన్ లో కేటీఆర్, హరీశ్ రావు
బీఆర్ఎస్ వీడడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. తామేమెరినీ ప్రోత్సహించడం లేదని జూపల్లి వెల్లడించారు. అసెంబ్లీలో తమకు సరిపడా మెజారిటీ ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వేల కోట్లు గుమ్మిరించినా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు ఫ్రస్టేషన్ లో అసత్య ప్రచారం చేస్తున్నారని.. బావబామ్మరిది నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కార్యకర్తలను కాపాడుకోవడానికి గంభీరంగా మాట్లాడుతున్నారని.. 60 లక్షల మంది సభ్యత్వం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోందని తెలిపారు.
Also Read: తొలి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
కేటీఆర్‌కు యెన్నం శ్రీనివాసరెడ్డి కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి సరిగా ఇంగ్లీషు మాట్లాడలేకపోతున్నారని పెయిడ్ ఆర్టిస్ట్ లతో ప్రభుత్వం మీద బురద చల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఇంగ్లీషు మాట్లాడటానికే తప్పా.. అడ్మినిస్ట్రేషన్‌కి పనికిరారని కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, లాల్ బహదూర్ శాస్త్రికి ఇంగ్లీషు రాదని తెలిపారు.